Share News

హైదరాబాద్‌లో విషాదం.. తల్లిదండ్రుల గొడవలతో బాలుడి ఆత్మహత్య

ABN , Publish Date - Jul 13 , 2026 | 03:14 PM

హైదరాబాద్‌లోని రాయదుర్గంలో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రుల గొడవలతో మనస్తాపం చెందిన15 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది.

హైదరాబాద్‌లో విషాదం.. తల్లిదండ్రుల గొడవలతో బాలుడి ఆత్మహత్య
Hyderabad News

హైదరాబాద్, జులై 13: నగరంలోని రాయదుర్గంలో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రుల గొడవలతో మనస్తాపం చెందిన15 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. గచ్చిబౌలి రాజీవ్‌నగర్ వడ్డెర బస్తీలో ఎల్లయ్య దంపతులు నివసిస్తున్నారు. వారికి కుమారుడు మోహన్(15), కూతురు ఉన్నారు. ఈ దంపతులు నిర్మాణ రంగంలో కార్మికులుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. గచ్చిబౌలిలోని ప్రభుత్వ పాఠశాలలో మోహన్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అయితే తల్లిదండ్రులు తరచూ గొడవ పడుతుండటంతో బాలుడు తీవ్ర ఆవేదనకు గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు.


శనివారం(జులై 11) రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన ఎల్లయ్య.. భార్యతో గొడవకు దిగాడు. గొడవ ఆపేందుకు మధ్యలోకి వెళ్లిన మోహన్‌.. ఎందుకు గొడవ పడుతున్నారంటూ తండ్రితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో మోహన్‌ను ఎల్లయ్య బూతులు తిట్టాడు. ఇక మీరు మారరా అంటూ కోపంతో సమీపంలో ఉన్న అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు బాలుడు. ఆపై కొడుకును వెతుక్కుంటూ తల్లి వెళ్లగా ఇంట్లోని రాడ్‌కు చీరతో ఉరి వేసుకున్న స్థితిలో మోహన్‌‌ను గమనించింది. వెంటనే కుటుంబసభ్యులు బాలుడిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే రాయదుర్గం పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి..

బనకచర్ల పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. తెలంగాణ అభ్యర్థనకు తిరస్కరణ

పదేళ్ల పాటు సింగరేణిని కేసీఆర్ ఓటు బ్యాంకుగా చూశారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 13 , 2026 | 03:42 PM