చదువుల ‘చుక్కా’నికి ‘వంద’నం
ABN , Publish Date - Nov 21 , 2026 | 03:48 AM
చదువుల చుక్కాని, ప్రజా ఉద్యమాలకు పెద్దదిక్కు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు చుక్కా రామయ్య శత వసంతాల వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి.
ఘనంగా చుక్కా రామయ్య శత వసంతాల వేడుకలు
మాస్టారి ఇంటికెళ్లి ఆశీస్సులు తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
రెండు సార్లు రామయ్య పాదాలకు నమస్కరించిన ముఖ్యమంత్రి
బాగున్నావా అని రేవంత్‌ను పలకరించిన మాస్టారు
ఎమ్మెల్సీగా ఆయన సహచర్యాన్ని గుర్తు చేసుకున్న సీఎం
హైదరాబాద్ సిటీ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): చదువుల చుక్కాని, ప్రజా ఉద్యమాలకు పెద్దదిక్కు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు చుక్కా రామయ్య శత వసంతాల వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. రామయ్య మాస్టారి వందో పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పి, ఆశీస్సులు తీసుకునేందుకు రాజకీయ, సామాజిక ప్రముఖులు విద్యానగర్‌లోని ఆయన ఇంటికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా విద్యానగర్‌కు వెళ్లి రామయ్యను కలిశారు. పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒకసారి, తిరిగి వెళ్లేటప్పుడు మరోసారి రామయ్య మాస్టారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు.
కొద్దిరోజులుగా మంచానికే పరిమితమైన రామయ్య ముఖ్యమంత్రిని ‘బాగున్నావా’ అంటూ పలకరించారు. రామయ్య కుమారులు శ్రీనివాస్, అచ్యుత్, కుమార్తెలు ఉమ, రాజేశ్వరిలను రేవంత్ పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అప్పటికే అక్కడ ఉన్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి, ఆచార్య హరగోపాల్, ఎమ్మెల్సీ కోదండరాం, కె.రామచంద్రమూర్తిలతో లెక్కల మాస్టారి జీవిత విశేషాల గురించి ముచ్చటిస్తూ ముఖ్యమంత్రి దాదాపు 40 నిమిషాలకు పైగా అక్కడే గడిపారు. రేవంత్ చొరవను జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, హరగోపాల్ ప్రశంసించారు. చుక్కా రామయ్య జన్మదినం తెలంగాణ రాష్ట్రానికి, విద్యారంగానికి పర్వదినమని సీఎం రేవంత్ మీడియాతో అన్నారు. సాయుధ రైతాంగ పోరాటం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు ప్రతి ప్రజా పోరాటంతో కలిసి నడిచిన రామయ్య మాస్టారు మనకు నిలువెత్తు ఆదర్శమని చెప్పారు.
ఐఐటీ అనే పదాన్ని తెలుగువారికి పరిచయం చేసిన ఘనత కూడా ఆయనదేనని కొనియాడారు. సామాజిక పరివర్తన కోసం నిరంతరం తపించిన గొప్ప విద్యావేత్త వందో పుట్టినరోజును తెలంగాణ ప్రజలంతా గర్వంగా భావించాలన్నారు. మండలి సభ్యుడిగా రామయ్య నిర్మాణాత్మక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో చుక్కా రామయ్య, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ వంటి విద్యావేత్తలతో కలిసి పనిచేశానని తాను గొప్పగా చెప్పుకుంటానని రేవంత్ అన్నారు. చట్టసభల్లో ప్రజా సమస్యలను లేవనెత్తడమే కాకుండా వాటి పరిష్కార మార్గాలు కూడా సూచించే అతికొద్ది మంది ప్రజాప్రతినిధుల్లో రామయ్య ఒకరని అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా లేదన్న విషయాన్ని ఆనాడు రామయ్య మండలిలో చెప్పేవరకు ఎవరికీ తెలియదని గుర్తు చేశారు. రావి నారాయణరెడ్డి, పీవీ నరసింహారావు, జైపాల్‌రెడ్డి, చుక్కా రామయ్య వీరంతా కాలానికి, రాజకీయాలకు అతీతమైన వ్యక్తులని రేవంత్ అన్నారు. చుక్కా రామయ్య ఆలోచనల స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు.
రామయ్య జీవితం స్ఫూర్తి పాఠం..
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా చుక్కా రామయ్యను కలిశారు. పుష్పగుచ్ఛం అందించి, పట్టు వస్త్రాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రామయ్య జీవితం భావితరాలకు స్ఫూర్తి పాఠమని కొనియాడారు. 1964లో చాదర్‌ఘాట్ ధర్మవంత్ పాఠశాలలో తన గురువు రామయ్యతో ఉన్న అనుబంధాన్ని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గుర్తుచేసుకున్నారు. తరగతి గదిలో రామయ్య మాస్టారు చెప్పే పాఠం ఒక్కసారి వింటే చాలు, అలాగే మనసులో నాటుకుపోయేదని అన్నారు. ‘మన చుక్కా రామయ్య’ పుస్తకాన్ని ఆవిష్కరించడం తనకు దక్కిన అరుదైన గౌరవమని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అన్నారు. వనమాలతో తన వివాహం నిశ్చయం కావడంలో రామయ్యదే ముఖ్య పాత్ర అని ఆచార్య హరగోపాల్ గుర్తు చేసుకున్నారు. సీనియర్ పాత్రికేయుడు కె.శ్రీనివాస్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ డీకే అరుణ, మాజీ మంత్రి హరీశ్‌రావు, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఐపీఎస్ అధికారి సజ్జనార్, జూలూరు గౌరీశంకర్, వీక్షణం వేణుగోపాల్, పాశం యాదగిరి రామయ్యను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో కాలేజీ సాంకేతిక విద్యా కమిషనర్‌గా పనిచేసిన మాజీ ఐఏఎస్ డాక్టర్ కె.లక్షీనారాయణ రామయ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ వార్తలనూ చదవండి:
వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!
ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..