సరదా వ్యసనమైతే జీవితాలు ఛిన్నాభిన్నం
ABN , Publish Date - Nov 28 , 2026 | 04:18 AM
మత్తుపదార్థాలు యువతకు పెనుశాపంగా మారాయని, సరదా వ్యసనమైతే జీవితాలు ఛిన్నాభిన్నమవుతాయని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు.
యువతకు పెనుశాపంగా డ్రగ్స్
మత్తుకు బానిసలైన స్నేహితులను బాధితులుగా చూడాలి
పునరావాస కేంద్రాలకు తరలించాలి
‘నషా ముక్త్ భారత్’ పాదయాత్ర ముగింపు సభలో చిరంజీవి పిలుపు
యువతే దేశానికి ఆస్తి: కిషన్ రెడ్డి
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం అందరి బాధ్యత: అక్కినేని నాగార్జున
బంజారాహిల్స్, అమీర్‌పేట, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): మత్తుపదార్థాలు యువతకు పెనుశాపంగా మారాయని, సరదా వ్యసనమైతే జీవితాలు ఛిన్నాభిన్నమవుతాయని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు. స్నేహితులెవరైనా మత్తు పదార్థాలకు బానిసలైనట్టు తెలిస్తే వారిని బాధితులుగా చూసి పునరావస కేంద్రాలకు తరలించి సాయపడాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో శుక్రవారం జరిగిన ‘నషా ముక్త్ భారత్’ ముగింపు సమావేశానికి చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. లక్ష్యం వైపు అడుగులు వేస్తున్న యువతకు మత్తుపదార్థాలు పెనుశాపంగా మారాయన్నారు. చెడు స్నేహాలు, మొహమాటాల వల్ల యువత డ్రగ్స్‌కు బానిసలైతే వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సినీ రంగంలో అడుగుపెట్టిన తొలినాళ్లలో ఎదురైన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. సినిమా హీరో కావాలనే లక్ష్యంతో చెన్నై వెళ్లిన తాను ఓ రోజు సాయంత్రం స్నేహితునితో కలిసి టీ తాగేందుకు పాండీ బజార్‌కు వెళ్లినట్టు చెప్పారు. కొత్తవాడినని తెలిసి అక్కడున్న వారు మద్యం తాగమని తనని ఒత్తిడి చేశారని, పార్టీలిస్తేనే అవకాశాలు వస్తాయని ప్రలోభ పెట్టారని తెలిపారు. అక్కడి నుంచి బయటపడిన తనకు ఓ పెద్ద మనిషి తారసపడి ఒక్కసారి మొహమాటానికి పోయి తాగితే అది వ్యసనంగా మారుతుందని హెచ్చరించారన్నారు. ఆ సలహా వల్లే తాను నటుడిగా ఎదిగానని చిరంజీవి పేర్కొన్నారు. హీరో అంటే సినిమాల్లో నటించేవారే కాదని, తల్లిదండ్రులు, దేశం గర్వపడేలా చేసేవారంతా హీరోలేనని అన్నారు. స్నేహితుల్లో ఎవరైనా డ్రగ్స్ వ్యసనానికి లోనైతే వారిని అసహ్యించుకోవద్దని, వ్యసనాన్ని ద్వేషించాలని సూచించారు. బాధితులపై సానుభూతి చూపి రిహాబిలిటేషన్ సెంటర్లకు తీసుకెళ్లి ఆ ఊబి నుంచి బయటపడేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఇక, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశాన్ని మత్తుపదార్థాల రహిత దేశంగా తీర్చిదిద్దాలని ప్రధాని మోదీ తీసుకున్న సంకల్పం దేశ భవిష్యత్తుకు, 70 కోట్ల మంది యువత జీవితాలకు సంబంధించిన విషయమని అన్నారు. దేశానికి పెద్ద ఆస్తి అయిన యువతను సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఏఐజీ ఆస్పత్రులు సీఈవో డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి, రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధానంద, సినీ దర్శకుడు సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున పిలుపునిచ్చారు. హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్ పాదయాత్రలో నాగార్జున శుక్రవారం పాల్గొన్నారు. అమీర్‌పేట మైత్రివనం వద్ద యాత్రలో పాల్గొన్న నాగార్జున.. మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో నటులు సాయికుమార్, శివారెడ్డి, దర్శకుడు బోయపాటి శ్రీను కూడా పాల్గొన్నారు. మూడు రోజుల పాటు కొనసాగిన ’హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్‘ పాదయాత్ర శుక్రవారంతో ముగిసింది. హైదరాబాద్ వ్యాప్తంగా 40 కిమీల మేర సాగిన ఈ యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందని బీజేపీ వర్గాలు తెలిపాయి.
ఈ వార్తలూ చదవండి
నిధులు ఉన్నా ఖర్చు చేయకపోతే ఎలా? అధికారులపై మంత్రి అడ్లూరి ఆగ్రహం
త్వరలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో వైద్య సేవలు: మంత్రి దామోదర రాజనర్సింహా