Share News

CM Revanth Reddy: కడుపులో విషం తగ్గించుకుంటే మంచిది: సీఎం కీలక సూచన

ABN , Publish Date - Jan 02 , 2026 | 12:42 PM

తెలంగాణలో మూసీ నది 240 కిలోమీటర్లు ప్రవహిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అనంతగిరి హిల్స్ నుంచి వాడపల్లి వరకు మూసీ ప్రవాహం ఉందన్నారు.

CM Revanth Reddy: కడుపులో విషం తగ్గించుకుంటే మంచిది: సీఎం కీలక సూచన

హైదరాబాద్, జనవరి 02: కొందరు కడుపులో విషం తగ్గించుకుంటే మంచిదని విపక్ష పార్టీలోని పలువురు కీలక నేతలకు సీఎం రేవంత్ రెడ్డి హితవు పలికారు. శుక్రవారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మూసీ కాలుష్యం కంటే కొందరు మనుషుల కడుపులో ఉన్న విషం అత్యంత ప్రమాదకరమన్నారు. తాను వివరాలు చెబుతుంటే ఎందుకు విషం కక్కుతున్నారంటూ విపక్ష సభ్యులను ఆయన సూటిగా నిలదీశారు. ప్రజలకు నిజాలు తెలియవద్దని చర్చ జరగకుండా చూడాలనుకుంటున్నారా? అని వారిని ప్రశ్నించారు. వివరాలు చెబుతుంటే నొప్పి ఎందుకు మీకు అంటూ విపక్ష సభ్యులపై ఆయన మండిపడ్డారు.

మొన్న వర్షాలు వచ్చినప్పుడు ఎక్కడికిపోయారంటూ వారిని సీఎం రేవంత్‌ రెడ్డి కడిగేశారు. కొంతమంది తనను రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటున్నారని.. రియల్ ఎస్టేట్ సైతం ఒక ఇండస్ట్రీనే అని ఆయన వివరించారు. హైటెక్ సిటీ నిర్మించాలనుకున్నప్పుడు కూడా ఇలాంటి విమర్శలే చేశారని పేర్కొన్నారు. రోజు రోజుకు పట్టణీకరణ పెరుగుతుందని చెప్పారు. రాబోయే 20 ఏండ్లలో 75 శాతానికి పట్టణీకరణ పెరుగుతుందని తెలిపారు.


తెలంగాణలో మూసీ నది 240 కిలోమీటర్లు ప్రవహిస్తుందన్నారు. అనంతగిరి హిల్స్ నుంచి వాడపల్లి వరకు మూసీ ప్రవాహం ఉందన్నారు. మూసీ, ఈసీ నదులు కలిసే చోటు బాపుఘాట్‌ నిర్మిస్తామని.. అందుకే అక్కడ గాంధీసరోవర్ ప్రాజెక్ట్ చేపట్టామని తెలిపారు. నదీ పరివాహక ప్రాంతంలోనే అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. జలవనరులను కలుషితం చేసి కబ్జాలు పెట్టి ఫాంహౌస్‌లు నిర్మించారని.. వాటి డ్రైనేజీలను జంట జలాశయాలకు కలిపారని మండిపడ్డారు. అందుకే ఆ డ్రైనేజీలను కూలగొట్టి.. కబ్జాలపై చర్యలు తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


అయితే మూసీ నది ప్రక్షాళనను మొదట 21 కిలోమీటర్లు చేయాలని చూస్తున్నామని.. హిమాయత్‌సాగర్‌ నుంచి గాంధీ సరోవర్‌ వరకు అభివృద్ధి చేస్తామని చెప్పారు. మార్చిలో తొలి దశ పనులు ప్రారంభిస్తామన్నారు. సంక్రాంతిలోగా తొలి దశ డీపీఆర్‌పై క్లారిటీ ఇస్తామని పేర్కొన్నారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 51 కి.మీ మూసీ అభివృద్ధి చేస్తామని వివరించారు. 51 కి.మీ ఎలివేటెడ్‌ కారిడార్లు నిర్మిస్తామన్నారు. మీరాలం ట్యాంక్‌ కూడా మూసీ అభివృద్ధిలో భాగమేనని స్పష్టం చేశారు. ఈ ట్యాంక్‌పై రూ.450 కోట్లతో బ్రిడ్జి నిర్మిస్తున్నామని సీఎం రేవంత్‌ చెప్పారు.


గతంలో గుజరాత్‌లో సబర్మతి నది అభివృద్ధి కోసం 60 వేల కుటుంబాలను మరో ప్రాంతానికి తరలించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. యూపీలో గంగా నది ప్రక్షాళన చేసి రివర్‌ఫ్రంట్‌ ఏర్పాటు చేశారన్నారు. నది పరివాహక ప్రాంతాల అభివృద్ధిని బీజేపీ ఎన్నికల అజెండాగా మర్చిందని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో నదుల ప్రక్షాళనను వ్యతిరేకించట్లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నదులు కలుషితం చేసి నివాసయోగ్యం కాని ప్రాంతాలుగా చేశారని మండిపడ్డారు. నదీ పరివాహక ప్రాంతాల నిర్వాసితులకు ప్రత్యామ్నాయం కోరామని చెప్పారు.


మూసీ నది కలుషితం కారణంగా నల్లగొండ జిల్లాలో ప్రజలు జీవించలేని పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కలుషిత నీటి నుంచి కాపాడాలని వేలాదిగా విజ్ఞప్తులు వచ్చాయన్నారు. ఏడాదంతా మూసీలో నీళ్లు ప్రవహించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. మూసీ ప్రక్షాళన కన్సల్టెంట్‌ కోసం గ్లోబల్ టెండర్లు పిలిచామన్నారు. 3 సంస్థల జాయించ్‌ వెంచర్‌ కింద మూసీ పునరుద్ధరణ చేపడుతున్నట్లు వివరించారు. గోదావరి నుంచి 20 టీఎంసీలు నగరానికి తరలించేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.


నగరం దాహార్తి తీర్చేందుకు 15 టీఎంసీలు తరలించేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. మరో 5 టీఎంసీలు గండిపేటకు తరలించాలని యోచన తమ ప్రభుత్వానికి ఉందని వివరించారు. మూసీ పరివాహాక ప్రాంతంలో ఆలయాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చి నిర్మిస్తామని తెలిపారు. మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిందేనని స్పష్టం చేశారు. వచ్చే మూడు నెలల్లో అంచనాలు ఫైనల్‌ చేస్తామని ప్రకటించారు. ఏడీబీ బ్యాంకు రూ.4,100 కోట్ల రుణం ఇస్తుందన్నారు. త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు.


గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు. మీ నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి కావాలో చెప్పాలని సూచించారు. పేదలకు మంచి ఇళ్లు కట్టించి వారికి మెరుగైన వసతులు కల్పిద్దామని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలనేదే తమ సంకల్పమని ఆయన స్పష్టం చేశారు. తాము మంచి పని చేయాలనుకుంటున్నాం… మీ సూచనలు సలహాలు ఇవ్వాలన్నారు. డీపీఆర్ సిద్దమయ్యాక ఎమ్మెల్యేలందరికీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి సలహాలు తీసుకుంటామని గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

డీఎస్పీ కార్యాలయం ఎదుట తండా వాసుల ఆందోళన

కలెక్టర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..

For More TG News And Telugu News

Updated Date - Jan 02 , 2026 | 12:59 PM