విజయశాంతి రెడ్డి సూసైడ్ కేసులో కీలక మలుపు.. లాస్ట్ కాల్ ఆధారంగా..
ABN , Publish Date - Feb 06 , 2026 | 11:07 AM
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విజయశాంతి రెడ్డి, తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. విజయశాంతి రెడ్డి లాస్ట్ కాల్‌ను తన సోదరుడికి చేసినట్లు గుర్తించిన పోలీసులు.. దాని ఆధారంగా విచారణ చేపట్టారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 6: చర్లపల్లి రైల్వే ట్రాక్‌పై తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న విజయశాంతి రెడ్డి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. గత నెల 30న రాత్రి చర్లపల్లి - ఘట్‌కేసర్ మధ్య గూడ్స్ రైలు కిందపడి ముగ్గురూ మృతి చెందిన ఘటనపై రైల్వే పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. విజయశాంతి రెడ్డి.. తన సోదరుడితో చివరి కాల్ మాట్లాడినట్లు సెల్‌ఫోన్ రికార్డుల ఆధారంగా పోలీసులు గుర్తించారు. కాల్ రికార్డింగ్ డైరెక్టరీ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. విజయశాంతి రెడ్డి సోదరుడి ఇంట్లో సికింద్రాబాద్ జీఆర్‌పీ పోలీసులు తనిఖీలు జరిపారు. విజయశాంతి రెడ్డి, ఆమె సోదరుడి బ్యాంకు లావాదేవీలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఈరోజు ఆమె సోదరుడిని విచారించే అవకాశం ఉందని సమాచారం.
పటాన్‌చెరు హాస్టల్ దగ్గర సీసీటీవీ ఫుటేజీలో విజయశాంతి రెడ్డి.. తన కూతురిని తీసుకెళ్తున్న దృశ్యాలు లభ్యమయ్యాయి. పటాన్‌చెరు హాస్టల్‌లో చదువుతున్న కూతురు చైతన్య రెడ్డిని.. గత జనవరి 27న ఔటింగ్‌కు తీసుకొచ్చిన విజయశాంతి రెడ్డి, జేఈఈ ప్రవేశ పరీక్ష రాయించిన అనంతరం 29న మళ్లీ హాస్టల్‌లో డ్రాప్ చేశారు. అయితే 30న రాత్రి 9 గంటల సమయంలో కుమారుడు విశాల్‌ను వెంట తీసుకుని మళ్లీ ఔటింగ్ కోరుతూ హాస్టల్‌కు వెళ్లారు. రెండోసారి ఔటింగ్ ఎందుకని హాస్టల్ నిర్వాహకులు ప్రశ్నించగా.. బంధువు చనిపోయారని విజయశాంతి రెడ్డి చెప్పారు. ఆ తర్వాతే ఇద్దరు పిల్లలతో కలిసి రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఆత్మహత్య నిర్ణయం ముందే తీసుకుని ఉంటే కూతురిని హాస్టల్‌లో మళ్లీ డ్రాప్ చేసేది కాదని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సమస్యలు, ఆస్తి తగాదాల వంటి బలమైన ఆధారాలు లేవని పోలీసుల విచారణలో తేలింది. విజయశాంతి రెడ్డి ఇంట్లో రైల్వే పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆమె బ్యాంకు బుక్‌లు, చెక్ బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక కారణాలు కూడా ఆత్మహత్యకు దారితీసి ఉండవచ్చనే అనుమానంతో బ్యాంకు లావాదేవీల వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. విజయశాంతి రెడ్డి.. తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న కారణాలు ఇంకా మిస్టరీగానే ఉన్నాయి. అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
ఏపీలో ఎన్‌హెచ్ నెట్‌వర్క్ అభివృద్ధికి నిరంతర నిధులు.. గడ్కరీకి థ్యాంక్స్ చెప్పిన సీఎం
Read Latest Telangana News And Telugu News