Share News

క్యాష్‌ లేదు గురూ..!

ABN , Publish Date - Oct 19 , 2026 | 04:55 AM

‘‘క్యాష్‌ లేదు గురూ..’’ చిరు వ్యాపారుల నుంచి పెద్దపెద్ద రియల్టర్ల వరకు ఇటీవల కాలంలో అందరి నోటా వినిపిస్తున్న మాట ఇదే. మార్కెట్‌లో నగదు కొరత తీవ్ర సమస్యగా మారి రొటేషన్‌ తగ్గి అనేక వ్యాపారాలు కుదేలవుతున్నాయి.

క్యాష్‌ లేదు గురూ..!
Cash Crunch in Telangana

  • నగదు నిల్‌.. వ్యాపారాలు డల్‌

  • మార్కెట్‌లో తగ్గిన నగదు ప్రవాహం.. తగ్గుతున్న లావాదేవీలు, కుదేలవుతున్న వ్యాపారాలు

  • ఆర్‌బీఐ చెస్ట్‌ల నుంచి బ్యాంకులకు తగ్గిన నగదు సరఫరా.. రియల్‌ ఎస్టేట్‌ రంగంపై తీవ్ర ప్రభావం

  • ఐటీ ఉద్యోగులు, ఎన్‌ఆర్‌ఐల పెట్టుబడులు భారీగా తగ్గాయి.. నగదు లేక పనుల వాయిదాలు

  • ఆర్థిక భయంతో మధ్య తరగతి వర్గం పొదుపు మంత్రం.. బంగారం, వెండి కొనుగోళ్లపైనే ఆసక్తి

  • షేర్‌ మార్కెట్‌, ఇతర పొదుపు మార్గాల్లోకి చిన్న మొత్తాలు.. చలామణీ తగ్గిన రూ.500 నోట్లు

హైదరాబాద్‌, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): ‘‘క్యాష్‌ లేదు గురూ..’’ చిరు వ్యాపారుల నుంచి పెద్దపెద్ద రియల్టర్ల వరకు ఇటీవల కాలంలో అందరి నోటా వినిపిస్తున్న మాట ఇదే. మార్కెట్‌లో నగదు కొరత తీవ్ర సమస్యగా మారి రొటేషన్‌ తగ్గి అనేక వ్యాపారాలు కుదేలవుతున్నాయి. చిన్నదానికి పెద్ద దానికి ఆన్‌లైన్‌ లావాదేవీలు పెరగడం, పెట్టుబడులు పెట్టే వారు తగ్గడం, చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టే వారు బంగారం, వెండి కొనుగోళ్ల వైపు లేదా మ్యూచువల్‌ ఫండ్స్‌ వైపు చూస్తుండడంతో బహిరంగ మార్కెట్‌లో నగదు లభ్యత పెద్ద సమస్యగా మారింది. చిన్న వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారాలు చేసే వారి వరకు వ్యాపారుల చేతిలో కరెన్సీ ఉండడం లేదు. నగదు కోసం ప్రయత్నిస్తున్నా కావాల్సినంత దొరకడం లేదు. వెరసి వ్యాపారులు నానా అవస్థలు పడుతున్నారు.


వందల కోట్ల టర్నోవర్‌ చేసే ఓ ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఇటీవల రూ.2 కోట్ల చెల్లింపునకు నగదు దొరక్క ఓ భూమి కొనుగోలును 15 రోజులు వాయిదా వేసుకుందంటేనే నగదు కొరత పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నానాపాట్లు పడి ఆ సంస్థ లావాదేవీ పూర్తి చేసినా.. అందులో సగానికిపైగా మొత్తాన్ని రూ.100, రూ.200 నోట్ల రూపంలో చేయడం గమనార్హం. రూ.500 నోట్ల విషయంలో ఉన్న కొరతను ఈ అంశం స్పష్టం చేస్తోంది. వ్యాపార సంస్థల అంచనా ప్రకారం రాష్ట్రంలో రోజువారీ నగదు చలామణి సుమారు రూ.80వేల కోట్ల వరకు ఉంటుంది. భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ) హైదరాబాద్‌ పరిధిలో సుమారు 156 కరెన్సీ చెస్ట్‌లు ఉన్నాయి. వీటిలో 37 చెస్ట్‌లు హైదరాబాద్‌ పరిధిలోనే ఉన్నాయి. బ్యాంకులకు నగదు నిల్వలు అందించడం, అవసరమైన సమయంలో నోట్ల పంపిణీకి తోడ్పడటం ఈ చెస్ట్‌ల కీలక విధులు.


అయితే, ఇటీవల కాలంలో ఆర్‌బీఐ చెస్ట్‌ల నుంచి కూడా నగదు పెద్దగా బయటకు రావడం లేదని బ్యాంకుల వర్గాలు చెబుతున్నాయి. రూ.10 కోట్లు నగదు కోసం ఇండెంట్‌ పెడితే నాలుగైదు కోట్లు నగదు ఇచ్చి మిగిలిన మొత్తాన్ని డిపాజిట్ల రూపంలో సర్దుబాటు చేసుకోవాలంటూ ఆర్‌బీఐ చెస్ట్‌లు కొంతకాలంగా చెబుతున్నాయని ఓ బ్యాంకు అధికారి పేర్కొన్నారు. ఈ కొరత వల్ల నగదు విత్‌డ్రాకు బ్యాంకులకు వెళుతున్న ఖాతాదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉన్న సొమ్ముంతా బ్యాంకులో డిపాజిట్‌ చేసి.. అవసరానికి పెద్ద మొత్తంలో ఒకేసారి విత్‌డ్రాకు ప్రయత్నిస్తున్న వారి పరిస్థితి అయితే మరింత ఘోరంగా ఉంటోంది. దీంతో నగదు కొరత సమస్యను నేరుగా చెప్పకుండా విత్‌డ్రా పరిమితులు పేరుతో బ్యాంకులు ఖాతాదారులను ఇబ్బంది పెడుతున్నాయి.


ఐటీ కొలువు భయం.. రియల్‌ ఎస్టేట్‌ డౌన్‌

ఆర్థిక వ్యవస్థలో రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాలు అత్యంత కీలకమైనవి. భూములు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్‌ల్లో ఫ్లాట్ల కొనుగోళ్లు, విక్రయాలు, ఇళ్లు, అపార్ట్‌మెంట్‌ల నిర్మాణానికి సంబంధించిన నిర్మాణ సామాగ్రి, ఇంటీరియర్‌ పనులు వంటి కార్యకలాపాలతో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారుతుంటోంది. సిమెంట్‌, స్టీల్‌, మార్బుల్‌, టైల్స్‌, కలప, విద్యుత్తు పరికరాల వ్యాపారాలతోపాటు కార్మిక సేవలు రియల్‌, నిర్మాణ రంగంతో ముడిపడి ఉంటాయి. అలాంటి ఈ రంగంలో లావాదేవీలు మందగిస్తే దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటుంది. పెద్ద మొత్తంలో నగదు చలామణీ, ఆర్థిక లావాదేవీలు నిలిచిపోతాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఇప్పుడు ఇదే పరిస్థితి నెలకొని ఉంది.


ఎందుకంటే రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులు పెట్టే వారిలో ఐటీ ఉద్యోగుల వాటా 60 శాతం దాకా ఉంటుంది. అయితే, అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వల్ల ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగం విషయంలో అభద్రతా భావంతో ఉన్నారు. లేఆ్‌ఫల భయం వెంటాడుతుండడంతో కొత్తపెట్టుబడుల వైపు చూడకుండా గతంలో కొనుగోలు చేసిన ఆస్తులను విక్రయానికి పెడుతున్నారు. కానీ కొనుగోలు చేసే వారు దొరకడం లేదు. వెరసి రియల్‌ ఎస్టేట్‌ రంగంలో నగదు ప్రవాహం గణనీయంగా తగ్గిపోయింది. ఇక, రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టే ఎన్‌ఆర్‌ఐల సంఖ్య కూడా తగ్గిందని రియల్టర్లు చెబుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ బిల్డర్‌ గతంలో ప్రతీ కొత్త ప్రాజెక్టు ప్రారంభ సమయంలో ఎన్‌ఆర్‌ఐలతో ప్రత్యేకంగా సమావేశాలు పెట్టి పెట్టుబడులు సేకరించేవారు.


ఇప్పుడు కూడా అలాంటి సమావేశాలు పెడుతున్నా పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపే వారి సంఖ్య భారీగా తగ్గిందని సదరు బిల్డర్‌ వాపోతున్నారు. ఇలా, ఐటీ ఉద్యోగులు, ఎన్‌ఆర్‌ఐలు పెట్టే పెట్టుబడులు బాగా తగ్గిపోవడంతో తమ చేతుల్లో నగదు లభ్యతకు కొరత వచ్చిందని జాతీయ స్థాయిలో నిర్మాణాలు చేసే ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ప్రతినిధి ‘ఆంధ్రజ్యోతి’ వద్ద వాపోయారు. రూ.5 కోట్లు నగదు సేకరించాలంటేనే ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. అలాగే, ఇటీవల కాలంలో చాలా మంది తమ వద్ద ఉన్న డబ్బుతో బంగారం, వెండి కొనుగోళ్లు(పొదుపు, పెట్టుబడిలో భాగంగా) చేస్తున్నారు. దీని వల్ల కూడా స్థిరాస్తి వ్యాపారం వైపు వచ్చే పెట్టుబడులు కొంతమేర తగ్గాయని రియల్టర్లు చెబుతున్నారు.


ఇతర వ్యాపారాలూ తగ్గాయి..

నగదు కొరత చిన్న వ్యాపారులకు కూడా సమస్యగానే మారింది. లావాదేవీలు తగ్గుముఖం పట్టడంతో వ్యాపార నిర్వహణలో రోజువారీ కార్యకలాపాలకు కూడా ఇబ్బంది పడుతున్నామని వ్యాపారులు వాపోతున్నారు. గతంలో తమ దుకాణానికి వచ్చిన వాళ్లలో ఒకే వ్యక్తి రూ.5లక్షల వరకు కొనుగోళ్లు చేసేవారని, ఇప్పుడు ఓ వ్యక్తి రూ.10 వేలు, రూ.20 వేలుకు మించి కొనుగోళ్లు చేయడం లేదని సికింద్రాబాద్‌ ప్రాంతంలో వెండి విక్రయాలు చేసే ఓ వ్యాపారి వాపోయారు. ఇక, రోజువారీ చెల్లింపులపై ఆధారపడే కిరాణా దుకాణాలు, కూరగాయల వ్యాపారులు, హోల్‌సేల్‌ మార్కెట్లు, చిన్న హోటళ్ల నిర్వాహకులు, నిర్మాణ రంగం, రవాణా, వ్యవసాయ అనుబంధ వ్యాపారాలపై నగదు కొరత సమస్య మరింత తీవ్రంగా వేధిస్తోంది.


వ్యాపార అవసరాల నిమిత్తం బ్యాంకుల్లో కరెంట్‌ ఖాతాలు తెరిచే చిరు వ్యాపారులు రోజంతా వ్యాపారం చేసి.. వచ్చిన నగదును బ్యాంకులో జమ చేస్తుంటారు. తమకు సరుకులు సరఫరా చేసే వారితో ఆ ఖాతాల ద్వారానే లావాదేవీలు చేస్తుంటారు. అవసరమైనప్పుడు ఆ ఖాతా నుంచి నగదు విత్‌ డ్రా చేసి వ్యాపార అవసరాలకు వాడుతుంటారు. అయితే, చిరువ్యాపారులు ఈ రోజు బ్యాంకులో నగదు జమ చేసి.. మరుసటి రోజుఆ డబ్బును నగదు రూపంలో బ్యాంకు నుంచి పొందలేకపోతున్నారు. బ్యాంకుల వద్ద నగదు లేకపోవడం, బ్యాంకులు విత్‌ డ్రాలపై పరిమితులు పెట్టడంతో వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. నిర్మాణ రంగంలో ఉన్నవారికైతే ఈ పరిమితులు చాలా ఇబ్బందిగా మారాయి. భవన నిర్మాణ కార్మికులకు, రవాణా చార్జీల చెల్లింపులు, వ్యవసాయ కూలీలకు చేసే చెల్లింపులను అన్నివేళలా యూపీఐతో చేయడం సాధ్యం కాదు. రోజువారీ కూలీ చెల్లించకపోతే మరుసటి రోజు పనులు ఆగిపోతాయి. నగదు లేక ఒక్క రోజు పని ఆగినా అది ప్రాజెక్టు పురోగతిపై తీవ్ర ప్రభావం చూపుతుంది.


కరెన్సీ కొరత ఎందుకొచ్చింది..?

ఫలానా కారణం వల్ల నగదు లభ్యతలో కొరత వచ్చిందని స్పష్టంగా చెప్పలేమని బ్యాంకర్లు, ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రాంతాన్ని బట్టి పరిస్థితులు మారుతుంటాయని, ప్రజలు చేసే విత్‌ డ్రాలు, కొనుగోళ్లు, డిపాజిట్ల మళ్లింపు, పంటల సీజన్‌, పెళ్లిళ్లు, పండుగలు, స్థానిక వ్యాపారాల అవసరాలు.. ఇవన్నీ నగదు లభ్యతపై ప్రభావం చూపుతాయని అంటున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో దావోస్‌ వేదికగా జరిగిన సదస్సులో యాక్సిస్‌ బ్యాంకు సీఈవో అమితాబ్‌ చౌదరి మాట్లాడుతూ.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా వస్తున్నా.. దేశీయ బ్యాకింగ్‌ నిర్వహణకు అవసరమైన డిపాజిట్ల సేకరణ బ్యాంకులకు అతిపెద్ద సవాలుగా మారుతోందని అన్నారు.


ఖర్చులు తగ్గించుకుంటున్నారు

ఇక, ఉద్యోగులు దుబారా ఖర్చులు తగ్గించుకోవడం కూడా నగదు ప్రవాహం తగ్గుముఖం పట్టడానికి ఓ కారణమనే అభిప్రాయాలు ఉన్నాయి. ఆర్థిక మాంద్యం భయమో లేక.. ఉద్యోగం విషయంలో అభద్రతో తెలియదు కానీ.. చాలా మంది ఉద్యోగులు, దిగువ మధ్య తరగతి కుటుంబాల వారు ఇటీవల దుబారా ఖర్చులను తగ్గించుకొని పొదుపు మంత్రం పాటిస్తున్నారని ఆర్థిక నిపుణలు చెబుతున్నారు. వారంలో ఒకటి, రెండు రోజులు రెస్టారెంట్లకు, వారాంతాల్లో స్థానిక పర్యాటక ప్రాంతాలకు వెళ్లే కుటుంబాల సంఖ్య క్రమంగా తగ్గుతోందని వ్యాపారులు అంటున్నారు. ఇది కూడా నగదు ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుందని అభిప్రాయపడుతున్నారు.


రూ.500 నోట్లు దాచేస్తున్నారు..

నల్లధనం కట్టడి పేరుతో కేంద్ర ప్రభుత్వం రూ.2000 నోట్లు రద్దు చేసింది. రూ.500, రూ.200, రూ.100 నోట్లు అమల్లోకి తెచ్చింది. అయితే చాలామంది రూ.500 నోట్లను తమ వద్ద ఉంచేసుకున్నారు. దీంతో చలామణీలో ఉన్న రూ.500 నోట్ల సంఖ్య చాలా తక్కువుగా ఉంది. బ్యాంకుల ఏటీఎంల్లో కూడా ఎక్కువుగా రూ.200, రూ.100 నోట్లే లభిస్తున్నాయి. రూ.500 నోట్ల అందుబాటు తక్కువుగా ఉండడంతో పెద్ద మొత్తంలో చేసే నగదు చెల్లింపుల అంశంలో వ్యాపారులకు ఇబ్బంది ఎదురవుతోంది. వెరసి నగదు ప్రవాహాన్ని దెబ్బ తీస్తుంది.


ఈ వార్తలు కూడా చదవండి

మూడోవంతు విద్యుత్‌ జెన్‌కో నుంచే...

కీసర మాజీ సీఐ కోటీశ్వరుడే!

క్యూనెట్‌ కేసు కీలక నిందితుడు డిగ్‌ విజయ్‌సింగ్‌ అరెస్టు

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 19 , 2026 | 04:55 AM