Share News

నైతికత లేని రాజకీయం.. కాంగ్రెస్ తీరుపై ఎంపీ సురేశ్ రెడ్డి ధ్వజం

ABN , Publish Date - Mar 11 , 2026 | 04:09 PM

రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ తన గళాన్ని వినిపిస్తోంది. ఫిరాయింపుల పర్వంపై ఎంపీ సురేశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే..

నైతికత లేని రాజకీయం.. కాంగ్రెస్ తీరుపై ఎంపీ సురేశ్ రెడ్డి ధ్వజం
BRS vs Congress Telangana

హైదరాబాద్, మార్చి11: రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ తన గళాన్ని వినిపిస్తోంది. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలు మారిన ఎమ్మెల్యేలు తాము ఎవరి గుర్తుపై గెలిచామో, ప్రజలు తమకు ఏ నమ్మకంతో ఓటు వేశారో ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఈ సందర్భంగా ఏబీఎన్‌తో మాజీ స్పీకర్, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కే.ఆర్.సురేశ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ ద్వంద్వ నీతి బయటపడింది.. ప్రభుత్వ స్పీకర్‌పై ఒత్తిడి తెచ్చారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ నిర్ణయంపై గతంలో మణిపూర్‌లో అసెంబ్లీ కేసులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. 2004లో దానం నాగేందర్ టీడీపీలో గెలిచి కాంగ్రెస్‌కు వస్తె, రాజీనామా చేసి రావాలని చెప్పాను. రాజీనామా చేశారు, ఆ ఎన్నికల్లో దానం నాగేందర్ ఓడిపోయారు. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే అయి, కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశారు, మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఒకవైపు దేశ వ్యాప్తంగా ‘రాజ్యాంగాన్ని కాపాడుతాం’ అని ప్రగల్భాలు పలుకుతూనే, మరోవైపు ఒక్క సభ్యుడిని కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ రాజ్యాంగ స్ఫూర్తిని నవ్వులపాలు చేస్తోంది. పార్టీ కండువాలు మార్చుకొని ప్రచారం చేస్తున్న నాయకుల తీరును తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. ప్రజలు తప్పు చేసినవారిని ఎప్పటికీ విడిచిపెట్టరు. ఈ ఫిరాయింపుల అంశాన్ని కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాదు, పార్లమెంట్‌లో ప్రస్తావించి న్యాయ పోరాటం చేస్తాం’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి...

ఏపీలో జరిగిన ఘటనలపై సీఎం ఆవేదన.. వారేం చేస్తున్నారంటూ ప్రశ్న

బీఆర్‌ఎస్‌లోనే ఉన్నా.. కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నా: కడియం శ్రీహరి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 11 , 2026 | 04:09 PM