వృద్ధురాలిని ఎత్తుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డి
ABN , Publish Date - Sep 03 , 2026 | 06:54 PM
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తి కావడంతో, ఆ పార్టీ పాలనా వైఫల్యాలు, ఇచ్చిన హామీల అమలులో మోసాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసనలకు దిగింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 03: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తైన సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు విధ్వంస నిరసన కార్యక్రమంనిర్వహించారు. ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక ముసలవ్వను తన భుజాలపై ఎత్తుకుని ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా వినూత్న రీతిలో నిరసన తెలిపి అందరి దృష్టిని ఆకర్షించారు.
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మల్లారెడ్డి మాట్లాడుతూ... కేసీఆర్ పాలనలో అన్నదాతలు సుభిక్షంగా ఉన్నారని గుర్తుచేశారు. తెలంగాణను అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ప్రశంసించారు. వ్యవసాయానికి ఉచిత కరెంట్, సాగునీరు, ఎరువులతో పాటు రైతుబంధు, రైతు బీమా వంటి విప్లవాత్మక పథకాలను ప్రవేశపెట్టి దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలిపారని మల్లారెడ్డి తెలిపారు.
ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రైతుల కళ్లల్లో కన్నీళ్లు తప్ప ఏమి లేవని మల్లారెడ్డి మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు గుప్పించి, అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కారని విమర్శించారు. మహిళలు, విద్యార్థులు, రైతులు, నిరుద్యోగులు ఇలా ప్రతి ఒక్క వర్గాన్ని కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని ధ్వజమెత్తారు. సంక్షేమాన్ని గాలికొదిలేసిన ఈ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని మల్లారెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేయడం దారుణం: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్..
ఉరిశిక్ష పడిన వ్యక్తికీ చివరిసారిగా చెప్పుకునే అవకాశం ఇస్తారు: కొండా సురేఖ..