కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై నిరసనలు.. బీఆర్ఎస్ వారం రోజుల షెడ్యూల్ ఇదే..
ABN , Publish Date - Aug 30 , 2026 | 07:41 PM
కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుబాటకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. రేవంత్ సర్కార్ వెయ్యి రోజుల పాలనలో హామీలు అమలు చేయడంలో విఫలమైందంటూ బీఆర్‌ఎస్ వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనుంది.
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుబాటకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. రేవంత్ సర్కార్ వెయ్యి రోజుల పాలనలో హామీలు అమలు చేయడంలో విఫలమైందంటూ బీఆర్‌ఎస్ వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం నిరసన కార్యక్రమాల కార్యాచరణను ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సెప్టెంబర్ 1న నిరసన కార్యక్రమాలకు సంబంధించిన లోగోను ఆవిష్కరించనున్నారు. అలాగే పార్టీ పెద్దలు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. 2వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యాలను ఎత్తిచూపుతూ నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా బాకీ కార్డులను పంపిణీ చేయనున్నారు. సెప్టెంబర్ 3న వ్యవసాయం, సాగునీటి రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు రైతు సదస్సులు ఏర్పాటు చేయనున్నారు. అలాగే 4వ తేదీన పెన్షన్‌దారులు, మహిళలకు రూ.2,500, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర హామీల అమలుపై వంటావార్పు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఇక, 5వ తేదీన జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ సమస్యపై నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. 6వ తేదీన సిద్దిపేట పట్టణంలో ఆటో ర్యాలీ నిర్వహించేందుకు బీఆర్‌ఎస్ నాయకత్వం నిర్ణయించింది. 7న కలెక్టరేట్లలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రజా సమస్యలపై దరఖాస్తులు సమర్పించనున్నారు. వారం రోజులపాటు నిర్వహించే ఈ నిరసన కార్యక్రమాల్లో పార్టీకి చెందిన అన్ని స్థాయిల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్ అధిష్ఠానం ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి
ప్లాస్టిక్ భూతం మధ్యన బోసిపోయిన రావిచెట్టు
‘టాక్సిక్’లో అసభ్యత తప్ప సమాజానికి ఉపయోగపడే సందేశం లేదు: రాజాసింగ్