పల్నాడు వాటర్ గ్రిడ్ పనులు ఆపాలి.. కేఆర్ఎంబీ చైర్మన్‌కు బీఆర్ఎస్ వినతి
ABN , Publish Date - Nov 23 , 2026 | 01:18 PM
కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసేలా ఏపీ ప్రభుత్వం పల్నాడు గ్రిడ్ పేరుతో పనులు చేపట్టిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికే ఎక్కువ నీటిని వాడుకున్న ఏపీ మళ్లీ 9 టీఎంసీల నీరు కావాలని అడుగుతోందని ఆరోపించారు
హైదరాబాద్, నవంబర్ 23: కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసేలా ఏపీ ప్రభుత్వం పల్నాడు గ్రిడ్ పేరుతో పనులు చేపట్టిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికే ఎక్కువ నీటిని వాడుకున్న ఏపీ మళ్లీ 9 టీఎంసీల నీరు కావాలని అడుగుతోందని ఆరోపించారు. సోమవారం హైదరాబాద్‌లో కేఆర్ఎంబీ చైర్మన్‌తో బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ అంశంపై కేఆర్ఎంబీ చైర్మన్‌కు వినతిపత్రం అందించామని తెలిపారు. ఎలాంటి అనుమతులు, సమచారం లేకుండా సాగర్ గర్భంలో చేపట్టిన పల్నాడు వాటర్ గ్రిడ్‌ను వెంటనే ఆపేలా ఉత్తర్వులు ఇవ్వాలని కేఆర్ఎంబీ చైర్మన్‌ను కోరామని చెప్పారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా రెండున్నర కోట్ల ప్రజల తాగునీటి అవసరాలను తీర్చాల్సి ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ఇప్పటికే ఎక్కువ నీటిని తీసుకొని మూడు నెలల కోసం 30 లక్షల మందికి 9 టీఎంసీలు కావాలని అడుగుతున్నారని ఏపీ ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సహా తెలంగాణలోని రెండున్నర కోట్ల ప్రజల తాగునీటి అవసరాలు వద్దా? అని ప్రశ్నించారు. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టిసీమ నుంచి నీటిని ఎత్తిపోసి మళ్లీ.. నూజివీడు ప్రాంతానికి నీరు కావాలని అడగడం దుర్మార్గమని పేర్కొన్నారు. కృష్ణా బోర్డును మోసం చేస్తున్నారంటూ ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించిన తరువాతే ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు సమాచారం ఇచ్చిందని గుర్తు చేశారు. కేవలం తాగునీటి కోసమే అని తెలంగాణలోని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు.
శ్రీశైలం తరహాలోనే తాగునీటి పేరిట సాగర్ వద్ద కూడా కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి లొంగిపోయి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం గట్టిగా కొట్లాడితే ఆపే అవకాశం ఉంటుందని బోర్డులోని వారు చెప్పారని వివరించారు. ప్రభుత్వం ప్రయత్నించినా లేకపోయినా తాము పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. డిసెంబర్ 10న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ సభకు కేటీఆర్‌ను ఆహ్వానించి.. ఈ జలదోపిడీని ఎండగడతామని హెచ్చరించారు. 24 గంటల పాటు ప్రజల కోసం పనిచేస్తే.. ఇన్ని నెలలుగా జరుగుతున్న పల్నాడు గ్రిడ్ పనులు ఎందుకు తెలియలేదు? అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు.
బ్లాస్టింగ్ అయినా కూడా ప్రభుత్వానికి కనీసం సమాచారం లేదా? అంటూ జగదీష్ రెడ్డి సందేహం వ్యక్తం చేశారు. పల్నాడు గ్రిడ్‌కు సంబంధించి ఏదో పత్రం తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. 2026 జీఓ ప్రకారమే టెండర్లు పిలిచారు... పనులు చేస్తున్నారని తెలిపారు. ఎక్కువ నీటిని వాడితే పంటలు ఎందుకు ఎండిపోయాయి? అని ప్రశ్నించారు. మంత్రి ఉత్తమ్ వస్తే ఏ జిల్లాలో అయినా ప్రజల వద్దకు వెళ్లి వాస్తవాలు తేల్చుకుందామని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు.
ఈ ప్రభుత్వానికి సోయి లేదు: సబితా ఇంద్రారెడ్డి
పల్నాడు గ్రిడ్ వల్ల హైదరాబాద్ సహా తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతోందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రం నీటిని తీసుకుపోయినా, ప్రాజెక్టు కడుతున్నా ఈ ప్రభుత్వానికి సోయి లేదని మండిపడ్డారు. హైదరాబాద్‌లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని.. ఇప్పటికే ట్యాంకర్ల వినియోగం పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మేలుకొని పల్నాటి వాటర్ గ్రిడ్ పని ఆపేలా చూడాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు.
ఈ ప్రభుత్వం చేతగానితనం వల్లే.. : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
తాగునీటి పేరుతో ఎనిమిది టీఎంసీల నీరు తీసుకుపోయేలా కుట్ర చేస్తున్నారంటూ ఏపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి విమర్శిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. పాలమూరు జిల్లాలో వలసలు మళ్లీ ప్రారంభమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలి: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
హైదరాబాద్ తాగునీటి సమస్యను కేఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్లామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వివరించారు. అలాగే ఏపీలో చేపట్టిన పల్నాడు వాటర్ గ్రిడ్ పనులు ఆపాలని కోరామని పేర్కొన్నారు. బీజేపీ, టీడీపీ కుమ్మక్కయి తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొడుతుంటే.. సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి అనుమతులు లేకుండా 80 శాతం పనులు పూర్తయినా రాష్ట్ర ప్రభుత్వానికి పట్టింపు లేదంటే.. సీఎం రేవంత్ రెడ్డి ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతోందని అన్నారు. ఇప్పటికైనా పనులు ఆపాలని, తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆసియా పవర్ ఇండెక్స్ 2026లో భారత్‌కు మూడో స్థానం.. మోదీకి రెండో ర్యాంక్
ఏపీకి వస్తున్న పెట్టుబడులు చూసి అసూయపడే పరిస్థితిలో పక్క రాష్ట్రాలు: ఎమ్మెల్యే సోమిరెడ్డి