బ్రాహ్మణ సంఘాలు ఐక్యంగా పనిచేయాలి
ABN , Publish Date - Nov 29 , 2026 | 01:55 AM
బ్రాహ్మణ సమాజం విద్య, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో అభివృద్ధి చెందేందుకు బ్రాహ్మణ సంఘాలు ఐక్యంగా పనిచేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూచించారు.
బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ సదస్సులో మంత్రి శ్రీధర్‌బాబు
బ్రాహ్మణులపై దుష్ప్రచారాన్ని ఖండించాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు
రాంనగర్, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): బ్రాహ్మణ సమాజం విద్య, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో అభివృద్ధి చెందేందుకు బ్రాహ్మణ సంఘాలు ఐక్యంగా పనిచేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన బ్రాహ్మణులు తమ హక్కుగా భావించి సద్వినియోగం చేసుకోవాలన్నారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆలిండియా బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీధర్‌బాబు మాట్లాడుతూ బ్రాహ్మణ సమాజంలోని అన్ని సంఘాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ఫెడరేషన్ కృషి చేయాలని సూచించారు. ఈబీసీ ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు అర్హులైన బ్రాహ్మణులు సంకోచించవద్దన్నారు. వాటి ద్వారా ప్రభుత్వ పథకాలు, విద్యా అవకాశాలు, రిజర్వేషన్లు పొందవచ్చన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బ్రాహ్మణుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా దుష్ప్రచారం జరుగుతోందని, దాన్ని బ్రాహ్మణులు ముక్తకంఠంతో ఖండించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు సూచించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేది బ్రాహ్మణులేనన్నారు. బ్రాహ్మణులకు జనాభా ప్రాతిపదికన రావాల్సిన నిధులు, ఉద్యోగాలు, రాజకీయ వాటా కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్ర మాజీమంత్రి సముద్రాల వేణుగోపాలచారి అన్నారు. బ్రాహ్మణ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి నైషధం సత్యనారాయణమూర్తి, ఫెడరేషన్ జాతీయ సెక్రటరీ జనరల్ ద్రోణంరాజు రవికుమార్ మాట్లాడుతూ నామినేటెడ్ పదవుల్లో బ్రాహ్మణులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. రూ.25 వేల కోట్ల నిధులతో బ్రాహ్మణులకు జాతీయ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎ్‌సఎస్ ప్రభాకర్, సంఘం జాతీయ అధ్యక్షుడు పండిత్ ఎస్‌డీ శర్మ, నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం
21 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై హరీశ్ రావు, జగ్గారెడ్డి.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి
Read Latest Telangana News And Telugu News