Share News

తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇన్‌చార్జి బీఎం సందీప్‌

ABN , Publish Date - Nov 15 , 2026 | 04:22 AM

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా బీఎం సందీప్‌ నియమితులయ్యారు.

తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇన్‌చార్జి బీఎం సందీప్‌
BM Sandeep

  • మీనాక్షి నటరాజన్‌ స్థానంలో కర్ణాటక నేత..

  • పార్టీ మరింత బలోపేతం: మహేశ్‌

హైదరాబాద్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా బీఎం సందీప్‌ నియమితులయ్యారు. అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) కార్యదర్శిగా ఉన్న ఆయన నియామకానికి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదముద్ర వేసినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్‌ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటి వరకూ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జిగా మీనాక్షీ నటరాజన్‌ వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆమె స్థానంలో బీఎం సందీప్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.


లండన్‌ యూనివర్సిటీలో అర్థశాస్త్రంలో కోర్సు చేసేందుకు మీనాక్షీ నటరాజన్‌ బ్రిటన్‌కు వెళ్లినప్పుడే కొత్త ఇన్‌చార్జి నియామకం జరగనుందన్న ప్రచారం జరిగింది. కానీ, ఎవరినీ నియమించకపోవటంతో మీనాక్షినే కొనసాగిస్తారన్న అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. మొత్తానికి, ఏఐసీసీ ఈ అనిశ్చితికి తెరదించుతూ కొత్త ఇన్‌చార్జిగా బీఎం సందీప్‌ను నియమించింది. సందీ‌ప్‌కు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ అభినందనలు తెలిపారు. గత ఇన్‌చార్జి మీనాక్షి తెలంగాణలో పార్టీ బలోపేతానికి, సంస్థాగత నిర్మాణానికి కృషి చేశారని, సందీప్‌ ఇన్‌చార్జిగా పార్టీ మరింత బలపడుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


ఎన్నికల వ్యూహకర్తగా పేరు

బీఎం సందీప్‌ కుమార్‌ స్వస్థలం కర్ణాటలోని చిక్‌మగళూరు. ఎన్నికల వ్యూహకర్తగా ఆయనకు పేరుంది. చిక్‌మగళూరు మునిసిపల్‌ కౌన్సిలర్‌గా ఒకసారి ఎన్నికయ్యారు. యూత్‌ కాంగ్రెస్‌లో పని చేశారు. అనంతరం, పార్టీలో మహారాష్ట్ర ఏఐసీసీ ఇంచార్జి కార్యదర్శిగా, గుజరాత్‌, దాద్రానగర్‌ హవేలీ, డామన్‌ అండ్‌ డయ్యూ ప్రాంతాలకు పార్టీ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణకు నియమితులు కావటానికి ముందు వరకూ కేరళ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జిగా ఉన్నారు. ఇప్పటి వరకూ అసెంబ్లీ, శాసనమండలి, లోక్‌సభ, రాజ్యసభ ఎన్నికల్లో సందీప్‌ పోటీ చేయలేదు. పూర్తిగా పార్టీ సంస్థాగత బాధ్యతల్లోనే ఉన్నారు.


ఇవి కూడా చదవండి...

చిత్తూరులో రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడు కలకలం

Updated Date - Nov 15 , 2026 | 04:22 AM