కాంగ్రెస్, బీజేపీ.. ముట్ట‘ఢీ’!
ABN , Publish Date - Sep 01 , 2026 | 05:08 AM
బిహార్‌లో విద్యార్థులపై కాల్పులు, జంతర్‌మంతర్ వద్ద ఆందోళనకారులపై లాఠీచార్జి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పట్ల బీజేపీ వ్యవహరించిన తీరు, రాహుల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు ఘటనలను నిరసిస్తూ.. యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు.
పార్టీల కార్యాలయాలపై పరస్పరం దాడులు
బిహార్‌లో విద్యార్థులపై కాల్పుల ఘటనను నిరసిస్తూ
బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన యూత్‌కాంగ్రెస్
ఆఫీసు ప్రధాన గేటుకు నలుపు రంగు పూసి నిరసన
కాంగ్రెస్ జెండాలను దహనం చేసిన బీజేపీ నేతలు
బీజేవైఎం నేతృత్వంలో గాంధీభవన్ ముట్టడికి యత్నం
కాంగ్రెస్ చర్యను నిరసిస్తూ నల్లగొండలో బీజేపీ ధర్నా
కాంగ్రెస్ నేతలది పిరికిపంద చర్య: రాంచందర్‌రావు
హైదరాబాద్/అఫ్జల్‌గంజ్/నల్లగొండ, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): బిహార్‌లో విద్యార్థులపై కాల్పులు, జంతర్‌మంతర్ వద్ద ఆందోళనకారులపై లాఠీచార్జి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పట్ల బీజేపీ వ్యవహరించిన తీరు, రాహుల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు ఘటనలను నిరసిస్తూ.. యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయ ప్రధాన గేటుకు నల్ల రంగు పూసి.. అమిత్‌షా రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ప్రతిగా బీజేపీ నాయకులు గాంధీభవన్‌ను ముట్టడించి.. కోడిగుడ్లు, టమాటాలు విసిరారు. ఇరుపార్టీల నేతల పరస్పర ఆందోళనలతో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రాంతం అట్టుడికింది. మరోవైపు.. యూత్ కాంగ్రెస్ తీరును నిరసిస్తూ నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయంపై బీజేపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. కార్యాలయం వైపు కోడిగుడ్లు, టమాటాలు విసిరేశాయి. ప్రతిగా బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడి ఇంటిపై కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల వద్ద రగడ
బిహార్‌లో విద్యార్థులపై కాల్పులు, ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళనకారులపై లాఠీచార్జి, ఖర్గే పట్ల బీజేపీ తీరును నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి, 40మంది కార్యకర్తలు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు. బీజేపీ కార్యాలయ ప్రధాన గేటుకు నల్ల రంగు పూసి నిరసన వ్యక్తంచేశారు. ఒక దశ లో బీజేపీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకవైపు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేస్తుండగా, మరోవైపు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్, 20 మంది కార్యకర్తలు బయటకు వచ్చి కాంగ్రెస్ జెండాలను దహనం చేశారు. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో.. పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నాయకుడు శివచరణ్ రెడ్డి, అతని వెంట ఉన్న వారిని అరెస్టు చేసి బేగంబజార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరగంట తరువాత బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కుండా గణేష్, కొందరు కార్యకర్తలు గాంధీ భవన్‌ను ముట్టడించడానికి వెళ్లగా..పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారంతా అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా తమ వెంట తెచ్చుకున్న కోడిగుడ్లను గాంధీభవన్ వైపు విసిరారు. చివరకు కుండా గణేష్‌తోపాటు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి అబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం కాంగ్రెస్, బీజేపీ కార్యాలయాల వద్ద బారికేడ్లు, పోలీసు పికెటింగ్‌ను ఏర్పాటు చేశారు.
నల్లగొండలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్
హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంపు కార్యాలయంపై బీజేపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు నల్లగొండ శ్రీనగర్‌లో కాలనీలో ఉన్న మంత్రి క్యాంపు కార్యాలయం వద్దకు వెళ్లి టమాటాలు, కోడిగుడ్లు విసిరేశారు. కార్యాలయం ఎదుట ఉన్న కటౌట్‌ను చించివేసి ఫ్లెక్సీ, దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆ సమయంలో మంత్రి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎవరూ లేరు. దాడి ఘటనతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అనంతరం వర్షిత్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ జోలికొస్తే కాంగ్రెస్ కార్యాలయాలను తగులబెడుతామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు ప్రతిగా ఆందోళనకు దిగారు. ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ ఆధ్వర్యంలో వందలాది మంది బీజేపీ కార్యాలయ ముట్టడికి వెళ్లగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పార్టీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఫ్లెక్సీలను కాంగ్రెస్ నేతలు చించివేశారు. మరోవైపు.. దేవరకొండ రోడ్డులో ఉన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్‌రెడ్డి ఇంటిపై దాడికి దిగారు. ఇంట్లోని సామగ్రి, కిటికీల అద్దాలను ధ్వంసం చేశారు. మంత్రి క్యాంపు కార్యాలయంపై బీజేపీ దాడులను నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు గడియారం సెంటర్‌లో ఆందోళనకు దిగారు. శంకర్‌నాయక్ మాట్లాడుతూ వర్షిత్ రెడ్డిని పీడీ యాక్ట్ కింద అరెస్టు చేయాలని డిమాండ్‌చేశారు.
కాంగ్రెస్ దాడి పిరికిపంద చర్య: రాంచందర్ రావు
బీజేపీ కార్యాలయాలు, నాయకుల నివాసాలపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడడం పిరికిపంద చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు. హింసాత్మక చర్యలను బీజేపీ శ్రేణులు తిప్పికొడితే కాంగ్రెస్ నేతలు రోడ్లపై తిరగలేరని స్పష్టం చేశారు. సంబంధం లేని విషయాల్లో అమిత్ షా రాజీనామాకు డిమాండ్ చేయడం హాస్యాస్పదమన్నారు. కాగా, ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. తమ సంయమనాన్ని చేతగానితనంగా భావించి, కార్యకర్తల జోలికొస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేస్తుంటే పోలీసులు తమాషా చూస్తున్నా రా? అని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఘటనపై వివరణ ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. కాగా, బీజేపీ కార్యాలయంపై దాడి కాంగ్రెస్ అరాచకాలకు నిదర్శనమని ఆ పార్టీ నేత లక్ష్మణ్ విమర్శించారు.
కక్షతోనే రాహుల్‌పై ఎఫ్‌ఐఆర్: మహేశ్‌గౌడ్
దళితుల పట్ల వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకం గా గళం విప్పిన రాహుల్‌గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమో దు చేయడం బీజేపీ కక్ష పూరిత రాజకీయాలకు నిదర్శనమని టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ మండిపడ్డారు. మల్లికార్జున ఖర్గే ఎదుర్కొన్న అవమానకర పరిస్థితుల గురించి ప్రశ్నించినందుకు రాహుల్‌పై కేసు నమోదు చేయడం దురదృష్టకరమన్నారు. బాధితుల పక్షాన నిలబడాల్సిన ప్రభుత్వం.. ప్రశ్నించిన వారినే నిందితులుగా చిత్రీకరించడం రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమని ధ్వజమెత్తారు. దళితుల పట్ల వివక్షను నిర్మూలించేందుకు కేంద్రం తీసుకున్న నిర్దిష్ట చర్యలేమిటో దేశ ప్రజలకు చెప్పాలని సోమవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. కాగా.. దళితుల పట్ల వివక్షను ప్రశ్నించినందుకు రాహుల్‌పై కేసులు పెడతారా? అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి
ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్టర్న్ వర్సిటీ క్యాంపస్
అధికారిక ఫ్లెక్సీలో కొండా సురేఖ ఫొటో ఔట్