Share News

సింగరేణిపై కట్టుకథలు ప్రచారం చేస్తున్నారు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ABN , Publish Date - Jan 24 , 2026 | 01:26 PM

సింగరేణిపై కట్టుకథలు ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థపై నిందలు మోపుతూ, కార్మికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆగ్రహించారు.

సింగరేణిపై కట్టుకథలు ప్రచారం చేస్తున్నారు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Deputy CM Bhatti Vikramarka

హైదరాబాద్, జనవరి 24: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్)పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) తీవ్రంగా ఖండించారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణిపై కట్టుకథలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వంపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. సింగరేణి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కొందరు రాతలు రాస్తున్నారని, ఈ నినాదాల వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయి? అంటూ ప్రశ్నలు సంధించారు. అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థపై నిందలు మోపుతూ, కార్మికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని డిప్యూటీ సీఎం ఆగ్రహించారు.


విచారణను స్వాగతిస్తున్నా...

‘ఒకరు కథనం రాశారు, మరొకరు లేఖ రాశారు, ఇంకొకరు విచారణకు ఆదేశించారు, ఈ ముగ్గురికీ ఉన్న సంబంధం ఏంటి’ అని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. సింగరేణి అటానమస్ సంస్థ అని, అన్ని నిర్ణయాలు వారే తీసుకుంటారని భట్టి తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రావడం, విచారణ జరిపించడాన్న స్వాగతిస్తున్నామని చెప్పారు. సింగరేణిలో తాను వచ్చాకే సైట్ విజిట్ నిబంధన వచ్చిందని ప్రచారం చేస్తున్నారని, నిజాలు బయటకు రావాలని, ప్రజలకు తెలియాలని చెప్పుకొచ్చారు.


అదంతా దుష్ప్రచారమే..

2018లోనే సైట్ విజిట్ నిబంధనను కోల్ ఇండియా తీసుకొచ్చిందని, 2021లో ఎన్‌ఎమ్‌డీసీ (NMDC) కూడా అమలు చేసిందని డిప్యూటీ సీఎం వెల్లడించారు. 2023లో సింగరేణిలోనూ సైట్ విజిట్ కండీషన్ అమల్లోకి వచ్చిందని, సీఎమ్‌పీడీఐ (CMPDI) డాక్యుమెంట్‌లో సైట్ విజిట్ తప్పనిసరని ఉందని చెప్పారు. 2018, 2021లో డిప్యూటీ సీఎం భట్టి లేడని, కాంగ్రెస్ లేదని ఆయన గుర్తు చేశారు. దేశంలోని పలు కేంద్ర, రాష్ట్ర సంస్థలు సైట్ విజిట్ అమలు చేస్తున్నాయన్నారు. రైల్వే, హిందుస్థాన్ కాపర్స్, గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ, మహారాష్ట్ర ప్రభుత్వ టెండర్లలోనూ ఈ నిబంధన ఉందని భట్టి పేర్కొన్నారు. సైట్ విజిట్ ఎక్కడా లేదన్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.


బీఆర్‌ఎస్ హయాంలోనే టెండర్లు...

దురుద్దేశంతో రాసిన ఓ కథనం ఆధారంగా ఒక నేత లేఖ రాశారని, అపోహలు పెరుగుతాయని వెంటనే టెండర్లు రద్దు చేశామని భట్టి తెలిపారు. నైనీ కోల్ బ్లాక్‌లకు బీఆర్‌ఎస్ హయాంలోనే టెండర్లు పిలిచారని, దేశంలో ఏ మైనింగ్ యాక్టివిటీలోనూ డీజిల్ సప్లయ్ చేసే పరిస్థితి లేదని చెప్పారు. 2022లో నైనీ బ్లాక్ టెండర్లలో డీజిల్ విధానం మార్చారని వెల్లడించారు. సింగరేణి 25 టెండర్లలో 20 బీఆర్‌ఎస్ హయాంలోనే జరిగాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 5 టెండర్లే జరిగాయని ఉపముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటివరకు కాంగ్రెస్‌కు సంబంధించిన ఎవరికీ టెండర్లు రాలేదని అన్నారు. సృజన్‌రెడ్డితో సీఎంకు సంబంధాలున్నాయన్న వార్తల్లో నిజం లేదన్నారు. సృజన్‌రెడ్డి కంపెనీ శోధ కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అని, ఎండీ దీప్తి రెడ్డి కందాల కూతురు అని, సృజన్‌రెడ్డి బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే అల్లుడని భట్టి వివరించారు.


అన్నింటిపై దర్యాప్తు చేద్దాం...

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావుకు అసలు ఏం కావాలని, కేంద్రానికి ఎందుకు లేఖలు రాస్తున్నారని ఉపముఖ్యమంత్రి ప్రశ్నించారు. 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని టెండర్లపై విచారణ జరపాలని తనకు లేఖ రాయాలన్నారు. తాడిచర్ల నుంచి నైనీ వరకు అన్నింటిపై దర్యాప్తు చేద్దామని అన్నారు. సీఎం రేవంత్ రాగానే చర్చించి విచారణకు ఆదేశిస్తామని చెప్పారు. తాను ఆస్తులు కూడబెట్టుకోవడానికి రాజకీయాల్లో రాలేదని, బొగ్గు బావుల్లో ఏ రాబందులను వాలనివ్వనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

స్థానిక సంస్థల ఎన్నికల బరిలో తెలంగాణ జాగృతి..

నైనీ కోల్ టెండర్ల వివాదం.. కేంద్ర బృందం దర్యాప్తు ప్రారంభం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 24 , 2026 | 03:43 PM