Share News

తెలంగాణ విద్యుత్ రంగానికి కేంద్రం సహకరించాలి.. భట్టి విక్రమార్క

ABN , Publish Date - Nov 27 , 2026 | 08:55 PM

తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి, ప్రసార, పంపిణీ వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు.

తెలంగాణ విద్యుత్ రంగానికి కేంద్రం సహకరించాలి..  భట్టి విక్రమార్క
Bhatti Vikramarka

ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి, ప్రసార, పంపిణీ వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు. శుక్రవారం న్యూఢిల్లీలోని అశోకా హోటల్‌లో కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సదస్సులో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. తెలంగాణ విద్యుత్ రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, విద్యుత్ పంపిణీ నష్టాల తగ్గింపు, ప్రభుత్వ విద్యుత్ బకాయిల చెల్లింపు, విద్యుత్ నిల్వ సామర్థ్యం పెంపు వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. ఈ లక్ష్యాలను సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు.


రూ.25,096 కోట్ల డీపీఆర్‌లకు ఆమోదం తెలపాలి

రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (RDSS) కింద స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, విద్యుత్ పంపిణీ నష్టాల తగ్గింపు, పంపిణీ వ్యవస్థల ఆధునికీకరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రూ.25,096 కోట్ల విలువైన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను (DPRs) ఈ ఏడాది మే 27న పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు సమర్పించిందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఈ పథకం కింద తెలంగాణకు ఇప్పటివరకు రూ.72 కోట్ల బడ్జెట్ సహాయం మాత్రమే అందిందని పేర్కొన్నారు. గత మూడేళ్లుగా రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల బిల్లింగ్ సామర్థ్యం మెరుగుపడుతోందని వివరించారు. పెండింగ్‌లో ఉన్న డీపీఆర్‌లకు 60 రోజుల్లో ఆమోదం తెలపడంతో పాటు 2028 మార్చి 31 వరకు పనుల అమలుకు పూర్తి గడువు కల్పించాలని కోరారు.


పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు కేంద్ర ఆర్థిక సహాయం

92 గిగావాట్ అవర్ల విద్యుత్ నిల్వ సామర్థ్యం కోసం రూ.14,500 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) అందించాలని కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ఉప ముఖ్యమంత్రి స్వాగతించారు. అయితే, ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు చేపట్టే పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు ఈ ఆర్థిక సహాయం అందే అవకాశం లేదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు చేపట్టే పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు మెగావాట్‌కు రూ.కోటి చొప్పున వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అందించాలని కోరారు. టీజీజెన్‌కో చేపట్టనున్న కల్లూరు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (CEA) త్వరితగతిన ఆమోదం తెలిపేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం టెండర్లు చేపట్టిన 2,000 మెగావాట్ అవర్ల బ్యాటరీ విద్యుత్ నిల్వ ప్రాజెక్టులకు కూడా కేంద్ర ఆర్థిక సహాయం అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలన్న తెలంగాణ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.


ఈ వార్తలూ చదవండి

నిధులు ఉన్నా ఖర్చు చేయకపోతే ఎలా? అధికారులపై మంత్రి అడ్లూరి ఆగ్రహం

త్వరలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో వైద్య సేవలు: మంత్రి దామోదర రాజనర్సింహా

Updated Date - Nov 27 , 2026 | 09:04 PM