ఇంధన పొదుపుతో దేశానికి మరింత భద్రత: భట్టి విక్రమార్క
ABN , Publish Date - Sep 16 , 2026 | 11:05 AM
ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. విద్యుత్ ఉత్పత్తితో పాటు విద్యుత్ పొదుపుపైనా దృష్టి సారించాలని తెలిపారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 16: ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. విద్యుత్ ఉత్పత్తితో పాటు విద్యుత్ పొదుపుపైనా దృష్టి సారించాలని తెలిపారు. ఈరోజు(బుధవారం) ఉదయం హెచ్‌ఐసీసీ (HICC) నోవాటెల్ హోటల్‌లో జరిగిన CII - ఎనర్జీ ఎఫిషియెన్సీ కౌన్సిల్ నిర్వహించే 25వ ‘ఎనర్జీ ఎఫిషియెన్సీ సమ్మిట్-2026’ కార్యక్రమానికి భట్టి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉత్పత్తి చేసే విద్యుత్ కంటే అవసరం లేకుండా పొదుపు చేసే విద్యుత్ యూనిటే చౌకైనదని చెప్పుకొచ్చారు. ఇంధన సామర్థ్యాన్ని కేవలం పర్యావరణ బాధ్యతగా చూడొద్దని.. ఇంధన సామర్థ్యం ఆర్థిక పోటీతత్వాన్ని పెంచే వ్యూహమని తెలిపారు.
మెరుగైన మోటార్లు, శీతలీకరణ వ్యవస్థలతో విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని డిప్యూటీ సీఎం సూచించారు. స్మార్ట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌తో విద్యుత్ వృథాను అరికట్టాలన్నారు. ప్రతి మెగావాట్ విద్యుత్ డిమాండ్ తగ్గితే విద్యుత్ వ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో విద్యుత్ డిమాండ్ మరింత పెరుగుతుందన్నారు. పరిశ్రమలు, తయారీ, డేటా సెంటర్లు, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్ రంగాలకు మరింత విద్యుత్ అవసరమని వెల్లడించారు. తక్కువ పీక్ డిమాండ్‌తో విద్యుత్ ఉత్పత్తి, ట్రాన్స్‌మిషన్‌పై ఒత్తిడి తగ్గుతుందని అన్నారు. ఇంధన పొదుపుతో దేశానికి మరింత ఇంధన భద్రత ఏర్పడుతుందని చెప్పారు.
భారత్‌లో మంచి పైలట్ ప్రాజెక్టులకు కొరత లేదని భట్టి స్పష్టం చేశారు. పునరుత్పాదక ఇంధనం, విద్యుదీకరణ, డిజిటలైజేషన్‌తో ఇంధన సామర్థ్యాన్ని పెంచాలని అన్నారు. AIతో విద్యుత్ వృథాను గుర్తించి వినియోగాన్ని మరింత సమర్థవంతం చేయాలన్నారు. భవిష్యత్తులో కర్మాగారాలు కేవలం విద్యుత్ వినియోగదారులుగా కాకుండా విద్యుత్ వ్యవస్థలో చురుకైన భాగస్వాములు కావాలని సూచించారు. ఇంధన సామర్థ్యాన్ని ఏడాదికి ఒకసారి చేసే ఆడిట్‌గా కాకుండా నిరంతర నిర్వహణ ప్రక్రియగా మార్చాలన్నారు. ప్రభుత్వం, పరిశ్రమలు, టెక్నాలజీ సంస్థలు, ఆర్థిక సంస్థలు, విద్యా సంస్థలు కలిసి పనిచేయాలని చెప్పారు. స్థిరమైన అభివృద్ధికి ఇంధన సామర్థ్యమే అత్యంత ఆచరణాత్మక మార్గమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా రోడ్డు భద్రతకు ప్రత్యేక చర్యలు
అర్ధరాత్రి పోకిరీల హల్‌చల్.. రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్‌తో హంగామా
Read Latest Telangana News And Telugu News