Share News

సహకార క్యాబ్‌ సర్వీస్‌!

ABN , Publish Date - Sep 13 , 2026 | 06:51 AM

ఎక్కకడికైనా వెళ్లటం కోసం క్యాబ్‌ బుక్‌ చేస్తే.. తొలుత ఒక రేటు కనిపిస్తుంది. అది ఎక్కువగా ఉందని, మరో పది నిమిషాలకు ప్రయత్నిస్తే.. మరో రేటు ఉంటుంది. మామూలు వేళల్లోనే ఇలా ఉంటే..

సహకార క్యాబ్‌ సర్వీస్‌!
Bharat Taxi

  • జాతీయ సహకార సంఘాల ఆధ్వర్యంలో భారత్‌ ట్యాక్సీ

  • దేశంలోని పలు నగరాల్లో సేవలు.. త్వరలో హైదరాబాద్‌లో..

  • ప్రయాణికులకు స్థిరమైన క్యాబ్‌ ధరలు

  • అదనపు చార్జీలు, సర్జ్‌ప్రైసింగ్‌ నుంచి విముక్తి

  • డ్రైవర్లకు జీరో కమిషన్‌ రైడ్‌లు..

  • వారి ఆదాయం మొత్తం వారికే

  • సంస్థ లాభాల్లో వాటా, ప్రమాద, ఆరోగ్య బీమా సదుపాయాలు

  • గత ఏడాది ప్రారంభం.. ఇప్పటికే 8 లక్షల మంది

  • ‘సారథులు’, 41 లక్షల మంది వినియోగదారులు

  • 2029 నాటికి దేశవ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలు

(సెంట్రల్‌ డెస్క్‌)

ఎక్కకడికైనా వెళ్లటం కోసం క్యాబ్‌ బుక్‌ చేస్తే.. తొలుత ఒక రేటు కనిపిస్తుంది. అది ఎక్కువగా ఉందని, మరో పది నిమిషాలకు ప్రయత్నిస్తే.. మరో రేటు ఉంటుంది. మామూలు వేళల్లోనే ఇలా ఉంటే.. ఇక వర్షం పడుతున్నప్పుడో, ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండే పీక్‌ అవర్స్‌లోనోనైతే ఇక చెప్పనక్కర్లేదు. ఇటువంటి జంజాటం ఏమీ లేకుండా.. స్థిరంగా ఒకే ధర చూపుతూ, గమ్యం చేరుకున్నాక కూడా దానిని పెంచకుండా అంతే మొత్తాన్ని వసూలు చేసే క్యాబ్‌ అందుబాటులో ఉంటే?? గత ఏడాది కేంద్రప్రభుత్వం మద్దతుతో పలు జాతీయ సహకార సంఘాలు సంయుక్తంగా ప్రారంభించిన భారత్‌ ట్యాక్సీ సరిగ్గా ఇటువంటిదే. ఈ క్యాబ్‌ సర్వీస్‌తో ప్రయాణికులకే కాదు.. డ్రైవర్లకు కూడా అనేక ప్రయోజనాలున్నాయి. జీరో కమిషన్‌ పద్ధతిలో ఇది పని చేస్తుంది. అంటే, ప్రయాణికుల నుంచి వచ్చే మొత్తంలో డ్రైవర్లు సంస్థకు ఎలాంటి కమీషన్‌ చెల్లించాల్సిన అవసరం లేదు. ఉభయకుశలోపరిగా ఉండే భారత్‌ ట్యాక్సీ సేవలు త్వరలో హైదరాబాద్‌లో కూడా ప్రారంభం కానున్నాయి.


దేశంలోనే తొలిసారిగా సహకార రంగంలో క్యాబ్‌

భారత్‌ ట్యాక్సీ దేశంలోనే తొలిసారిగా సహకార విధానంలో పని చేసే క్యాబ్‌ సర్వీస్‌. గత ఏడాది జూన్‌ 6వ తేదీన ‘బహుళ రాష్ట్రాల సహకార సంఘాల చట్టం, 2002’ కింద ‘సహకార్‌ ట్యాక్సీ కో ఆపరేటివ్‌ లిమిటెడ్‌’ అనే పేరుతో ఏర్పాటైంది. నాబార్డ్‌, నాఫెడ్‌, క్రిభ్కో, ఎన్‌సీడీసీ తదితర 8 జాతీయస్థాయి సహకార సంఘాల ఆధ్వర్యంలో ఈ సంస్థను నెలకొల్పారు. ‘సారథి మాలిక్‌’ అనే సూత్రం ప్రాతిపదికగా ఇది నడుస్తుంది. డ్రైవర్లను సారథిగా సంబోధిస్తారు. డ్రైవర్లే యజమానులు అనేది ఈ సర్వీస్‌కు పునాది. ప్రస్తుతం భారత్‌ ట్యాక్సీ సేవలు ఢిల్లీ, గుజరాత్‌, లక్నో, చండీగఢ్‌, ముంబై, జైపూర్‌, కాన్పూర్‌, పుణెలలో అందుబాటులో ఉన్నాయి. 8 లక్షల మంది సారథులు, 41 లక్షల మంది వినియోగదారులు నమోదు చేసుకున్నారు. భారత్‌ ట్యాక్సీ యజమానులు డ్రైవర్లే (సారథులే). సంస్థ పెట్టుబడి షేర్‌ ధర రూ.100. కనీసం ఐదు షేర్లు (రూ.500) కొని ఏ డ్రైవర్‌ అయినా సంస్థలో భాగస్వామి కావచ్చు. సంస్థ డైరెక్టర్ల బోర్డులో డ్రైవర్ల తరఫు ప్రతినిధులకు అవకాశం కల్పిస్తారు. తద్వారా, భారత్‌ ట్యాక్సీ విధివిధానాల రూపకల్పనలో స్వయంగా డ్రైవర్లు పాల్గొంటారు.


ఎలా పని చేస్తుంది?

ఇది పూర్తిగా జీరో కమీషన్‌ ప్రాతిపదికన నడుస్తుంది. అంటే, ట్రిప్పుల ద్వారా లభించే ఆదాయం మొత్తం డ్రైవర్లకే చెందుతుంది. సంస్థకు ఎలాంటి కమీషన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతేకాదు, షేర్ల విక్రయం తదితర మార్గాల్లో సంస్థకు లభించే ఆదాయంలో 80 శాతాన్ని డ్రైవర్లకే పంచుతారు. ఒక నిర్ణీత వ్యవధిలో వారి వాహనం ఎన్ని కి.మీ.లు ప్రయాణించింది అన్న దాన్ని బట్టి లాభాలను చెల్లిస్తారు. ఆదాయంలో 20 శాతాన్ని నిర్వహణ ఖర్చుల కోసం సంస్థ వద్దే జమ చేస్తారు. ఇక, ప్రయాణికులు ప్రయాణించిన దూరం, సమయం ఆధారంగా వారు చెల్లించాల్సిన మొత్తం ఎంతో నిర్ణయం అవుతుంది. దాని మీద అదనంగా కన్వీనియెన్స్‌ ఫీ, సర్జ్‌ప్రైసింగ్‌ (వాతావరణ పరిస్థితులు, డిమాండ్‌ను బట్టి ధరలను డైనమిక్‌గా మార్చటం) వంటివి ఉండవు. ఎయిర్‌పోర్టు ప్రీపెయిడ్‌ సర్వీసుల మీద మాత్రం 7 శాతం సర్వీస్‌చార్జి వసూలు చేస్తారు. మహిళా డ్రైవర్లను ప్రోత్సహించటం కోసం సారథి దీదీ, బైక్‌ దీదీ అనే ప్రత్యేక విభాగాలను కూడా భారత్‌ ట్యాక్సీలో అమలు చేస్తున్నారు. భద్రతపరంగా లైవ్‌ ట్రాకింగ్‌, డ్రైవర్లకు తప్పనిసరి కేవైసీ, సేఫ్టీ రేటింగ్స్‌ వంటివి ఉంటాయి. ఇక ప్రభుత్వ యాప్‌లు డిజిలాకర్‌, ఉమాంగ్‌, ఏపీఐ సేతు వంటి వాటితో భారత్‌ ట్యాక్సీ అనుసంధానమై ఉంటుంది. డ్రైవర్లకు 5లక్షల ప్రమాదబీమా, వారి కుటుంబాలకు ఆయుష్మాన్‌ భారత్‌ కింద రూ.5 లక్షల ఉచిత వైద్య చికిత్స, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ వంటి సామాజిక భద్రత లభిస్తుంది.


క్రమంగా విస్తరణ

ప్రస్తుతం కొన్ని నగరాలకే పరిమితమైన భారత్‌ ట్యాక్సీని క్రమంగా విస్తరిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోపు 100 నగరాల్లో అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో కసరత్తు జరుగుతోంది. సెప్టెంబరు-ఆక్టోబరు నెలల్లో హైదరాబాద్‌, గౌహతి, షిల్లాంగ్‌, భోపాల్‌, నాగ్‌పూర్‌, నాసిక్‌, వారణాసి, కాన్పూర్‌, ఆగ్రా, ప్రయాగ్‌రాజ్‌లలో విస్తరించే ప్రణాళికలున్నాయి. 2029 నాటికి దేశవ్యాప్తంగా భారత్‌ ట్యాక్సీ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.



ఈ వార్తలు కూడా చదవండి:

నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు
రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై స్పష్టత ఇవ్వాలి
Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 13 , 2026 | 06:51 AM