తెలంగాణ ప్రజల పోరాటాన్ని నవ్వులపాలు చేసే విధంగా కాంగ్రెస్ పాలన సాగుతోంది: కిషన్ రెడ్డి
ABN , Publish Date - Apr 01 , 2026 | 08:52 PM
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని ధ్రువీకరిస్తూ బుధవారం లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు-2026పై చర్చ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 01: ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని ధ్రువీకరిస్తూ బుధవారం లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు-2026పై చర్చ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సుదీర్ఘమైన పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. కాంగ్రెస్ ప్రభుత్వం 1969లో జై తెలంగాణ అన్నందుకు 369 మంది ఉద్యమకారులను కాల్చి చంపింది. ఆ తర్వాత చివరిదశ తెలంగాణ ఉద్యమంలోనూ.. 1,200 మంది ఆత్మబలిదానం చేశారు. వారి త్యాగంతోనే తెలంగాణ వచ్చింది. నాలుగు కోట్ల మంది ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నారు.
రాష్ట్రం విడిపోయిన తర్వాత.. తెలంగాణతోపాటుగా ఆంధ్రప్రదేశ్ కూడా పోటీగా అభివృద్ధి చెందాలని భావించాం. కానీ అక్కడి మా సోదర, సోదరీమణులు మాకు రాజధాని లేదని బాధపడే పరిస్థితి నెలకొనడం దురదృష్టకరం. ఈరోజు బిల్లుపై చర్చ సందర్భంగా.. కాంగ్రెస్ సభ్యులు కొందరు.. తెలంగాణకు విమానాశ్రయాలు లేవని చెప్పారు. తెలంగాణలో విమానాశ్రయాలు లేకపోవడానికి కారణం ఎవరు? ఆ పాపం ఎవరిదో చెప్పగలరా? ఆంధ్రప్రదేశ్‌లో 8 విమానాశ్రయాలున్నాయంటే.. తెలంగాణలో కేవలం ఒక ఎయిర్ పోర్ట్ మాత్రమే ఉంది. అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి విమానాశ్రయాలు ఇవ్వలేదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కొత్తగూడెం, వరంగల్, ఆదిలాబాద్‌లలో విమానాశ్రయాలకు భూమి కోసం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేఖలు రాసినా.. భూములు కేటాయించలేదు.. కనీసం స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో వరంగల్, ఆదిలాబాద్‌లలో విమానాశ్రయాల ఏర్పాటుకు భూములు కావాలని కోరినా.. బీఆర్ఎస్ వ్యవహరించిన తీరే కాంగ్రెస్ ప్రభుత్వం సైతం వ్యవహారించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు రైల్వేలు, జాతీయ రహదారుల అభివృద్ధి జరగలేదు.
తెలంగాణ అనేక రకాలుగా వెనుకబడింది కాబట్టే.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వచ్చింది. కచ్చితంగా ఇవాళ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని కావాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇవాళ ఆ దిశగా ఓ సానుకూలమైన పరిస్థితి రావడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా.. అన్నదమ్ముల్లాగా ఈ రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఏపీలో కూడా గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటైంది.
అంతేకాకుండా.. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తోంది. అలాగే తెలంగాణలోనూ రైల్వేలు, జాతీయ రహదారులు మొదలుకుని అన్ని రకాల అభివృద్ధి పనులకు కేంద్రం అండదండగా నిలుస్తోంది. 42 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ ఏకకాలంలో చేసుకుంటున్నాం. గతంలో 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారులుంటే.. ఈ పదేళ్లలో.. అదనంగా దాదాపు 3 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ.. తెలుగు రాష్ట్రాలను నిర్లక్ష్యం చేసింది కాబట్టే.. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన.. అమరావతి రాజధానిగా ఏర్పాటవుతున్న సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక అభినందనలు. అమరావతి అద్భుతమైన రాజధానిగా అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
గతంలో పదేళ్లపాటు తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో.. తెలంగాణను దోచుకుంటోంది. దీని నుంచి తెలంగాణ ప్రజలు జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణను తెచ్చుకున్నామో.. ఆ లక్ష్యాల సాధన జరగడం లేదు. తెలంగాణ ప్రజల పోరాటాన్ని నవ్వులపాలు చేసే విధంగా కాంగ్రెస్ పాలన సాగుతోంది’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
టీడీపీ హైకమాండ్ సీరియస్.. స్పందించిన ఎమ్మెల్యే
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే.. కఠిన చర్యలు: కేంద్రం
For More TG News And Telugu News