రాజ్యసభకు చేరిన రాజధాని అమరావతి బిల్లు
ABN , Publish Date - Apr 01 , 2026 | 05:41 PM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా చట్టబద్ధత కల్పించిన బిల్లుకు లోక్‌సభలో ఆమోదం పొంది.. రాజ్యసభకు చేరుకుంది. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ బుధవారం న్యూఢిల్లీలో వెల్లడించారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 01: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా చట్టబద్ధత కల్పించిన బిల్లుకు బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందింది. అనంతరం ఈ బిల్లు రాజ్యసభకు చేరింది. ఈ బిల్లు తమ వద్దకు వచ్చిందని రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఈ రోజు న్యూఢిల్లీలో వెల్లడించారు. ఈ బిల్లు ఆమోదం కోసం గురువారం రాజ్యసభలో పెడతామని స్పష్టం చేశారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును గురువారం రాజ్యసభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రవేశపెట్టనున్నారు.
అనంతరం మధ్యాహ్నం 1.00 గంటకు ఈ బిల్లుపై సభలో చర్చ జరగనుంది. రాజ్యసభలో సైతం ఈ బిల్లు ఆమోదం పొందితే.. అనంతరం రాష్ట్రపతి వద్దకు ఈ బిల్లును పంపుతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం ఈ బిల్లును ఆమోదిస్తూ సంతకం చేస్తే.. రాజధాని అమరావతి చట్టంగా మారుతోంది.
ఏపీ పునర్విభజన చట్ట సవరణ పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ బుధవారం లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. సుమారు రెండు గంటలపాటు దీనిపై చర్చ జరిగింది. ఈ చర్చలో టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, వైసీపీ సమాజ్ వాదీతోపాటు పలు పార్టీలు ఎంపీలు పాల్గొన్నారు. అనంతరం ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్ స్థానంలో ఉన్న తెన్నేటి కృష్ణప్రసాద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటూ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. దీనిని కేంద్రానికి పంపిన విషయం విదితమే.
ఈ వార్తలు కూడా చదవండి..
వాణిజ్య సిలిండర్ ధర పెరిగిన వేళ.. డొమెస్టిక్ గ్యాస్ ధరపై కేంద్రం క్లారిటీ
సీఎం చంద్రబాబు కృషి వల్లే.. లోక్‌సభలో బిల్లు ఆమోదం: మంత్రి నారాయణ
For More AP News And Telugu News