దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి: అడ్లూరి
ABN , Publish Date - Nov 29 , 2026 | 06:14 AM
దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ చెప్పారు.
హైదరాబాద్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ చెప్పారు. సమస్యలను అధిగమించేందుకు దివ్యాంగులు సానుకూల దృక్పథంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దివ్యాంగుల సంక్షేమం, సాధికారత పట్ల సీఎం రేవంత్ రెడ్డి ఎంతో సానుకూలంగా ఉన్నారని, వారి సమస్యలకు తగిన ప్రాధాన్యమిస్తారని భరోసా ఇచ్చారు. డిసెంబరు 3న నిర్వహించనున్న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా, అర్థవంతంగా నిర్వహించేందుకు శనివారం బంజారా భవన్‌లో వివిధ దివ్యాంగుల ఉద్యమ, సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డిసెంబరు 3న జరిగే వేడుకలు దివ్యాంగుల హక్కులు, విజయాలు, ప్రభుత్వ బాధ్యతలపై సమాజానికి అవగాహన కల్పించే వేదికగా నిలవాలని, ఇందులో వారి ప్రతిభను చాటేలా సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలు, విజయగాథలకు చోటు కల్పించాలని సూచించారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతకు సరైన వేదిక కల్పిస్తే సంప్రదాయ చదువులకు అతీతంగా ఎన్నో రంగాల్లో అద్భుత విజయాలు సాధించగలరని మంత్రి అడ్లూరి అన్నారు. తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల (టీజీఈఎంఆర్‌ఎస్) సంయుక్త ఆధ్వర్యంలో 40 మంది విద్యార్థులకు చలనచిత్ర రంగంలో ఏడు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఈ శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్న విద్యార్థులకు మంత్రి సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందజేసి అభినందించారు.
ఇవి కూడా చదవండి...
ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం
21 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై హరీశ్ రావు, జగ్గారెడ్డి.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి
Read Latest Telangana News And Telugu News