సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు నారాయణరావు కన్నుమూత
ABN , Publish Date - Aug 27 , 2026 | 07:39 AM
ప్రముఖ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు (73) కన్నుమూశారు. ఆయన మరణ వార్తను నటి కరాటే కల్యాణి సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్: సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు (73) కన్నుమూశారు. ఆయన మరణ వార్తను నటి కరాటే కల్యాణి సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. జీవీ 100కు పైగా చిత్రాల్లో నటించారు. 1976లో కె.బాలచందర్ దర్శకత్వం వహించిన ‘అంతులేని కథ’ సినిమాతో నటుడిగా వెండి తెరకు పరిచయయ్యారు.
నారాయణరావు నటించిన తొలి సినిమాకే ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. మద్రాస్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్న నారాయణరావు.. స్టార్ హీరోలు రజనీకాంత్, చిరంజీవిలకు బెస్ట్ ఫ్రెండ్. ‘అంతులేని కథ’, ‘ముత్యాల పల్లకి’, ‘అంగడి బొమ్మ’, ‘చిలకమ్మ చెప్పింది’, ‘గ్యాంగ్ లీడర్’, ‘హిట్లర్’ వంటి సినిమాల్లో ఆయన నటించారు. నారాయణరావు సినిమాలతో పాటు పలు సీరియళ్లలోనూ నటించి బుల్లితెరపై సందడి చేశారు.
నిర్మాతగా..
దేవాంతకుడు, ఇంటికో రుద్రమ్మ, యముడికి మొగుడు, పెళ్లి నీకు శుభం నాకు.. వంటి పలు సినిమాలను నిర్మాతగా వ్యవహరించారు. నారాయణరావు మృతిపై 'మా' అసోసియేషన్ సంతాపం తెలిపింది. ఆయన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. కొన్ని దశాబ్దాల పాటు సినీ రంగంతో అనుబంధం కొనసాగించిన ఒక సీనియర్ నటుడిని కోల్పోవడం పరిశ్రమకు తీరని లోటుగా సినీ వర్గాలు భావిస్తున్నాయి.
వ్యక్తిగత జీవితం:
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కురుమద్దాలి గ్రామంలో నారాయణరావు జన్మించారు. ఆయన బాల్యం, విద్యాభ్యాసం అంతా గుంతకల్లులో సాగింది. గిడుగు విశాలాక్షి వద్ద భరతనాట్యం, నటరాజ రామకృష్ణ వద్ద కూచిపూడి నృత్యం నేర్చుకున్నారు. ఏఆర్.కృష్ణ వద్ద నటనలో శిక్షణ తీసుకున్నారు. చదువుకునే రోజులలో మహమ్మద్ బీన్ తుగ్లక్, ప్రతాపరుద్రీయం, మంచుతెర తదితర నాటకాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించారు. దివంగత సినీ నటులు కోటా శ్రీనివాసరావు, నూతన ప్రసాద్, దేవదాస్ కనకాల తదితరులు నారాయణరావుకు రంగస్థల మిత్రులు.
ఇవి కూడా చదవండి:
నోబాల్స్ తగ్గాలంటే.. టెస్టుల్లో ఫ్రీ హిట్ పెట్టాలి: టీమిండియా కోచ్