గెలుపు ముంగిట..
ABN , Publish Date - Aug 27 , 2026 | 05:49 AM
శ్రీలంకతో టెస్ట్ సిరీస్ క్లీన్‌స్వీప్‌కు భారత్ మరింత చేరువైంది. ఫాలోఆన్‌లో పసిందు సూర్యబండార (92), కమిందు మెండిస్ (55) అర్ధ శతకాలతో పోరాడినా.. కీలక తరుణంలో భారత స్పిన్నర్లు చెలరేగారు.
ఫాలో ఆన్‌లో లంక 229/6
ఆధిక్యం 16 పరుగులే
కొలంబో: శ్రీలంకతో టెస్ట్ సిరీస్ క్లీన్‌స్వీప్‌కు భారత్ మరింత చేరువైంది. ఫాలోఆన్‌లో పసిందు సూర్యబండార (92), కమిందు మెండిస్ (55) అర్ధ శతకాలతో పోరాడినా.. కీలక తరుణంలో భారత స్పిన్నర్లు చెలరేగారు. దీంతో రెండో టెస్ట్‌లో ఆటకు నాలుగో రోజైన బుధవారం రెండో ఇన్నింగ్స్‌లో లంక 229/6 స్కోరు చేసింది. వర్షం, వెలుతురు లేమితో ఆట నిలిచే సమయానికి సోనాల్ దినుష (7), కేశర (3) క్రీజులో ఉన్నారు. మానవ్ సుతార్ రెండు వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 503/9 డిక్లేర్‌కు లంక 16 పరుగుల ఆధిక్యాన్ని మాత్రమే నమోదు చేసింది. అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌లో లంక 290 పరుగులకు ఆలౌటైంది. ఫాలోఆన్‌ను తప్పించుకోవాలంటే లంకకు మరో 39 పరుగులు కావాల్సి ఉండగా.. చేతిలో రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. కానీ, ఓవర్‌నైట్ స్కోరు 265/8కు లంక 25 పరుగులు మాత్రమే జోడించగలిగింది. సెంచరీ సాధించిన ఓవర్‌నైట్ బ్యాటర్ సోనాల్ (103)ను అవుట్ చేసిన సారాంశ్ జైన్.. కెరీర్‌లో తొలి వికెట్‌ను సాధించాడు.
ఆఖర్లో దెబ్బకొట్టిన మానవ్..
213 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన లంక.. ఓపెనర్ ఉడార (3) వికెట్‌ను వేగంగా చేజార్చుకొంది. అయితే, మరో ఓపెనర్ మిషార (32), ఫామ్‌లో ఉన్న పసిందు రెండో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొనే ప్రయత్నం చేశారు. మిషారను జడేజా ఎల్బీగా వెనక్కిపంపాడు. ఈ దశలో జతకలసిన పసిందు, మెండిస్ మూడో వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యంతో పోరాడారు. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగిన సూర్యబండార, మెండిస్ అర్ధ శతకాలు సాధించారు. అయితే, ప్రసిద్ధ్ బౌలింగ్‌లో గిల్ క్యాచ్‌తో మెండిస్ వెనుదిరిగాడు. దీంతో లంక 199/3తో టీ బ్రేక్‌కు వెళ్లింది. కానీ, మూడో సెషన్‌లో సుతార్ తొలుత కెప్టెన్ ధనంజయ డిసిల్వ (23)ను.. ఆ తర్వాత సెంచరీ దిశగా సాగుతున్న పసిందును కూడా అవుట్ చేశాడు. ముందుకొచ్చి షాట్ ఆడే ప్రయత్నం చేసిన పసిందు మిస్‌కాగా.. పంత్ వికెట్లను గిరాటేశాడు. డిక్‌వెల్లా (6)ను జైన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకొన్నాడు. కానీ, సోనాల్, కేశర భారత బౌలర్లను విసిగిస్తూ క్రీజులో నిలిచారు. వాతావరణం ప్రతికూలంగా మారడంతో ఆఖరి సెషన్‌ను ముందుగానే ముగించారు.
స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: 503/9 డిక్లేర్
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 89.4 ఓవర్లలో 290 ఆలౌట్; శ్రీలంక రెండో ఇన్నింగ్స్: ఉడార (సి) జైన్ (బి) సిరాజ్ 3, మిషార (ఎల్బీ) జడేజా 32, పసిందు (స్టంప్) పంత్ (బి) మానవ్ 92, మెండిస్ (సి) గిల్ (బి) ప్రసిద్ధ్ 55, ధనంజయ (సి) పడిక్కళ్ (బి) మానవ్ 23, సోనాల్ (బ్యాటింగ్) 7, డిక్‌వెల్లా (ఎల్బీ) జైన్ 6, కేశర (బ్యాటింగ్) 3; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 72.4 ఓవర్లలో 229/6; వికెట్ల పతనం: 1-5, 2-63, 3-178, 4-209, 5-212, 6-218; బౌలింగ్: ప్రసిద్ధ్ కృష్ణ 10-1-31-1, సిరాజ్ 9-4-11-1, మానవ్ సుతార్ 18-2-81-2, సారాంశ్ జైన్ 17.4-3-55-1, జడేజా 18-2-48-1.
గిల్ వెనక్కి పరిగెత్తుతూ..
టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫీల్డ్‌లో మరో అద్భుత క్యాచ్‌తో జట్టుకు బ్రేక్ అందించాడు. 44వ ఓవర్‌లో ప్రసిద్ధ్ బౌలింగ్‌లో మెండిస్ ఇచ్చిన క్యాచ్‌ను గిల్ వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి అందుకొన్నాడు.
పొంచి ఉన్న వరుణుడు..
ఆటకు ఆఖరి రోజు కూడా వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. రోజంతా ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. తొలి సెషన్‌లో జల్లులు పడే అవకాశం ఉండగా.. ఆఖరి సెషన్‌లో ఓ మోస్తరు వర్షం కురియవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి..
27 ఏళ్లకే ఆటకు వీడ్కోలు.. తాను చదువుకున్న స్కూలే కారణమంటూ..
వీరేంద్ర సెహ్వాగ్‌ను గుర్తు చేస్తున్న తనయుడు ఆర్యవీర్