Share News

హైదరాబాద్‌లో అర్ధరాత్రి కార్డన్ సెర్చ్.. గంజాయి, టాబ్లెట్ల స్వాధీనం

ABN , Publish Date - Jul 09 , 2026 | 08:27 AM

హైదరాబాద్ హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగర్ బస్తీలో పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్ విక్రేతలే లక్ష్యంగా సాగిన ఈ విస్తృత తనిఖీలు నగరంలో తీవ్ర కలకలం రేపాయి.

హైదరాబాద్‌లో అర్ధరాత్రి కార్డన్ సెర్చ్.. గంజాయి, టాబ్లెట్ల స్వాధీనం
Hyderabad Police

హైదరాబాద్, జులై 9: నగరంలోని పాతబస్తీ పరిసరాల్లో నేరాల నియంత్రణ, మత్తు పదార్థాల రవాణాకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా పోలీసులు భారీ సెర్చ్ ఆపరేషనే చేపట్టారు. అడిషనల్ జాయింట్ సీపీ తప్సీర్ ఇక్బాల్ ప్రత్యక్ష పర్యవేక్షణలో తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 5.30 గంటల వరకు ఈ సోదాలు సాగాయి. ఈ భారీ ఆపరేషన్ కోసం 38 ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. దాదాపు 1,100 మంది పోలీసు సిబ్బంది ఒక్కసారిగా మంగర్ బస్తీని చుట్టుముట్టి, ప్రతి ఇంటినీ కూలంకషంగా తనిఖీ చేశారు. బస్తీ నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా, బయటి వారు లోపలికి రాకుండా రహదారులను దిగ్బంధించారు.


యువతను మత్తుకు బానిసలుగా మారుస్తూ, ఇళ్లల్లో రహస్యంగా దగ్గు సిరప్‌లను విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు ఈ సోదాలు చేశారు. ఈ సోదాల్లో భారీ మొత్తంలో గంజాయి, అక్రమ మద్యం నిల్వలతో పాటు, మత్తు కోసం ఉపయోగించే నిషిద్ధ నైట్రావెట్ టాబ్లెట్లు, అక్రమ దగ్గు సిరప్ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాల సీజ్‌తో పాటు, బస్తీలో ఆశ్రయం పొందుతున్న పాత నేరస్థులపై కూడా పోలీసులు నిఘా పెట్టారు. దీర్ఘకాలంగా పోలీసులకు దొరకకుండా తిరుగుతున్న పలువురు నిందితులను ఈ సోదాల ద్వారా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని పలు అనుమానాస్పద వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

మరింతగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 09 , 2026 | 09:02 AM