Share News

హైదరాబాద్ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం.. పొగతో ప్రజల అవస్థలు

ABN , Publish Date - Nov 08 , 2026 | 07:40 PM

హైదరాబాద్‌లోని కాటేదాన్ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్లాస్టిక్ గోదాంలో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న ఫ్లైవుడ్ గోదాంకు కూడా వ్యాపించాయి. సుమారు రెండు గంటలుగా మంటలు అదుపులోకి రాకపోవడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది.

హైదరాబాద్ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం.. పొగతో ప్రజల అవస్థలు
Katedan Fire

హైదరాబాద్‌, నవంబర్ 8: నగరంలోని కాటేదాన్ పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం కలకలం రేపింది. ఓ ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీ ఎత్తున వ్యాపించాయి. ప్లాస్టిక్ వస్తువులు పెద్ద మొత్తంలో నిల్వ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. కొద్దిసేపటికే పక్కనే ఉన్న ఫ్లైవుడ్ గోదాంకు కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో అగ్నికీలలు మరింత ఎత్తుకు ఎగసిపడ్డాయి.

సుమారు రెండు గంటలుగా మంటలు కొనసాగుతుండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దట్టమైన పొగ పరిసర ప్రాంతాలను కమ్మేయడంతో పాటు.. ప్లాస్టిక్ కాలుతున్న ఘాటైన వాసనకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయినప్పటికీ మంటలు అదుపులోకి రాకపోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.


మరోవైపు.. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది స్పందించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన దాదాపు 45 నిమిషాల తర్వాతే ఫైరింజన్ ఘటనా స్థలానికి చేరుకుందని వారు ఆరోపిస్తున్నారు. అగ్నిమాపక వాహనాలు వచ్చేలోపే మంటలు మరింత వ్యాపించడంతో స్థానికులే రంగంలోకి దిగారు. తమ వద్ద అందుబాటులో ఉన్న అగ్నిమాపక పరికరాలతో పాటు నీటిని చల్లుతూ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయితే మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వారి ప్రయత్నాలు సరిపోలేదు. చివరకు ఫైర్ సిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు, జరిగిన ఆస్తి నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

నవంబరు 9 నాటికి పంట నష్టం అంచనాలు పూర్తి చేయాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి

జగన్ చొక్కామడతా పెడతామంటే భయపడే పరిస్థితుల్లో ప్రజలు లేరు: పల్లా శ్రీనివాసరావు

Updated Date - Nov 08 , 2026 | 09:04 PM