Share News

పెట్టుబడి పేరుతో మోసం.. GBEX టెక్నోకార్ట్ సీఈఓపై కేసు

ABN , Publish Date - Jul 24 , 2026 | 05:51 PM

అధిక లాభాల ఆశ చూపించి మోసం చేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. GBEX టెక్నోకార్ట్ LLP సీఈఓపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పెట్టుబడి పేరుతో మోసం.. GBEX టెక్నోకార్ట్ సీఈఓపై కేసు
Hyderabad Investment Fraud

హైదరాబాద్, జులై 24: అధిక లాభాల ఆశ చూపించి మోసం చేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. GBEX టెక్నోకార్ట్ LLP సీఈఓపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్టుబడి పేరుతో మోసం జరిగిన ఘటనపై కేసు నమోదైంది. జూబ్లీహిల్స్‌కు చెందిన శ్రీకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు GBEX టెక్నోకార్ట్ LLP సీఈఓ చిక్కాల రాజా రామ్ మోహన్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన కంపెనీలో పెట్టుబడి పెడితే నెలకు 3 శాతం లాభాలు వస్తాయని, మూడు నెలల్లో అసలు మొత్తాన్ని తిరిగి చెల్లిస్తానని నమ్మించి పెట్టుబడి పెట్టేలా ప్రేరేపించినట్లు బాధితుడు ఆరోపించారు. USDT, క్రిప్టో ట్రేడింగ్ ద్వారా భారీ లాభాలు వస్తాయని చెప్పి తనను ఆకర్షించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.


నిందితుడి మాటలు నమ్మిన శ్రీకర్ బ్యాంకులో బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రూ.8 లక్షలు పెట్టుబడిగా ఇచ్చినట్లు తెలిపారు. మొదట 45 రోజుల పాటు రోజుకు రూ.2,280 చెల్లించిన నిందితుడు.. అనంతరం చెల్లింపులు నిలిపివేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే మరింత సమయం కావాలని చెప్పడంతో పాటు, ఇతరులను కూడా పెట్టుబడులు పెట్టేలా ఒత్తిడి చేసినట్లు ఆరోపించారు. గతంలోనూ ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు, ఎస్‌ఆర్‌ నగర్ పోలీస్ స్టేషన్‌లో రాజాపై కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు మాదాపూర్ పోలీసులు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

జనసేనకు పత్రికలు, ఛానళ్లు లేవు.. కార్యకర్తలే మీడియా: మంత్రి నాదెండ్ల మనోహర్

విద్యా వ్యవస్థకు ఉపాధ్యాయులే వెన్నెముక: సీఎం చంద్రబాబు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 24 , 2026 | 05:55 PM