హైదరాబాద్ గచ్చిబౌలిలో విషాదం.. హాస్టల్ భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్య
ABN , Publish Date - Jun 06 , 2026 | 08:56 PM
హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ గచ్చిబౌలిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన యువకుడి వేధింపులు తాళలేక.. ఒక యువతి హాస్టల్ భవనంలోని ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. క్షణికావేశంలో ఆమె తీసుకున్న ఈ ఘోర నిర్ణయం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
హైదరాబాద్, జూన్ 06: నగరంలోని గచ్చిబౌలిలో ఓ యువతి హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు.. గచ్చిబౌలిలోని ఎలైట్ కోలివింగ్ హాస్టల్‌లో నివసిస్తున్న 23 ఏళ్ల మొల్లి దుర్గ అనే యువతి.. సాయి కుమార్ అనే యువకుడితో కొంతకాలంగా ప్రేమలో ఉంది. డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న సాయి కుమార్.. కొంతకాలంగా దుర్గను తీవ్రంగా వేధిస్తుండటంతో వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే ప్రియుడి వేధింపులను భరించలేక తీవ్ర మనస్తాపానికి గురైన దుర్గ.. తాను ఉంటున్న హాస్టల్ బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి కిందకు దూకేసింది.
తీవ్ర గాయాలపాలైన ఆమెను గమనించిన స్థానికులు.. చికిత్స నిమిత్తం వెంటనే సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమెను పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి మావయ్య రవి కుమార్ ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం దుర్గ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. యువతి ఆత్మహత్యకు ప్రధాన కారణమైన నిందితుడు సాయి కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రెండేళ్ల ప్రజా తీర్పు.. ఏపీ అభివృద్ధికి నాంది: చంద్రబాబు
పవన్ తెలంగాణకు వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదు: రాంచందర్ రావు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News