Share News

కేంద్ర మంత్రి పేరుతో భారీ మోసం.. డాక్టర్‌ను ముంచిన సైబర్ నేరగాళ్లు!

ABN , Publish Date - Jul 08 , 2026 | 09:07 AM

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేరుతో సోషల్ మీడియాలో కనిపించిన నకిలీ పెట్టుబడి ప్రకటనను నమ్మిన 76 ఏళ్ల వైద్యుడు సైబర్ మోసగాళ్ల వలలో చిక్కి రూ.86.44 లక్షలు పోగొట్టుకున్న ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది.

కేంద్ర మంత్రి పేరుతో భారీ మోసం.. డాక్టర్‌ను ముంచిన సైబర్ నేరగాళ్లు!
Hyderabad Cyber Crime

హైదరాబాద్, జులై 8: సోషల్ మీడియాలో ప్రముఖుల పేర్లను వాడుకుంటూ అమాయకులను బురిడీ కొట్టించే సైబర్ కేటుగాళ్లను నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఏకంగా కేంద్ర మంత్రి పేరుతో నేరగాళ్లు బురిడీ కొట్టించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరుతో సోషల్ మీడియాలో వచ్చిన ఒక నకిలీ పెట్టుబడి ప్రకటనను నమ్మి, హైదరాబాద్‌కు చెందిన ఓ వైద్యుడు ఏకంగా రూ.86.44 లక్షలు పోగొట్టుకున్నారు. బాధితుడు సోషల్ మీడియాలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేరుతో ఉన్న సదరు ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ లింక్‌ను క్లిక్ చేయడంతో ఈ మోసానికి తెరలేచింది. లింక్ ఓపెన్ కాగానే సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా బాధితుడిని సంప్రదించారు.


తమ మాయ మాటల భారీ లాభాలు వస్తాయంటూ ఆయనను నమ్మించారు. ఆపై బాధితుడితో ఒక నకిలీ డీమ్యాట్ ఖాతాను తెరిపించారు. అక్కడితో ఆగకుండా రిజిస్ట్రేషన్ ఫీజులు, ట్రేడింగ్ ఛార్జీలు, సెబీ (SEBI) అనుమతులు, పన్నుల పేరుతో విడతలవారీగా బాధితుడి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. బాధితుడికి నమ్మకం కలిగించడానికి, ఆయన పెట్టిన పెట్టుబడికి భారీగా లాభాలు వస్తున్నట్లు కొన్ని నకిలీ స్క్రీన్ షాట్లు, మెసేజ్‌లను కూడా పంపించారు. వాటిని చూసి నిజమేనని నమ్మిన డాక్టర్, వారు అడిగినప్పుడల్లా డబ్బులు పంపుతూ పోయారు.


ఖాతాలో లాభాలు బాగా కనిపిస్తుండటంతో, ఆ డబ్బును డ్రా (విత్‌డ్రా) చేసుకోవాలని బాధితుడు ప్రయత్నించారు. అయితే, ఆ డబ్బును విడుదల చేయాలంటే మరిన్ని చెల్లింపులు చేయాలంటూ నిందితులు ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించారు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు, తాను మోసపోయానని గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియాలో ప్రముఖులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీల ఫొటోలు లేదా పేర్లతో వచ్చే పెట్టుబడి ప్రకటనలను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

బెంగళూరు-మైసూర్ హైవేపై దారుణం.. కారు అడ్డు పెట్టి కుటుంబంపై దాడి.. వీడియో వైరల్

రాత్రంతా తలుపు హ్యాండిల్‌పై కింగ్ కోబ్రా.. ఇంట్లోనే బందీ అయిన కుటుంబం..

Updated Date - Jul 08 , 2026 | 09:35 AM