సంధ్యారావు పేరుతో ఫేక్ అకౌంట్ నడుపుతుందే కాంగ్రెస్: హరీశ్ రావు
ABN , Publish Date - Sep 10 , 2026 | 11:20 AM
అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్ర ఘర్షణలు, వాగ్వాదాలతో అసెంబ్లీ సమావేశాలు వాడివేడీగా సాగుతున్న నేపథ్యంలో శాసనసభలో ముఖ్యమంత్రి వాఖ్యలపై హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..
హైదరాబాద్, సెప్టెంబర్ 10: ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఫేక్ అకౌంట్లను అసెంబ్లీకి తీసుకొచ్చి చదవడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీశ్ రావు దుయ్యబట్టారు. అంతర్జాతీయ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా ముఖ్యమంత్రి ఆరోపిస్తున్న సంధ్యారావు పేరిట అసలు బీఆర్‌ఎస్‌లో ఎవరూ లేరని, అసలు అలాంటి పదవే బీఆర్ఎస్‌లో లేదని ఆయన స్పష్టం చేశారు. సంధ్యారావు పేరుతో కాంగ్రెస్ పార్టీయే ఫేక్ అకౌంట్ నడుపుతున్నదని ఆయన ఆరోపించారు.
బీఆర్‌ఎస్‌పై తప్పుడు ఆరోపణలు చేయడమే కాకుండా వాటిని సమర్ధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీయే ఓ ఫేక్ అకౌంట్‌ను సృష్టించిందని హరీశ్ ఆరోపించారు. ఆ ఫేక్ అకౌంట్‌ను సాక్ష్యంగా తీసుకొచ్చి అసెంబ్లీలో చదవడమేమిటని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలా చేయడం పవిత్రమైన శాసనసభను అవమానించడమే అవుతుందన్నారు. దీనికి ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తూ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సభను తప్పుదోవ పట్టించడానికే రేవంత్ రెడ్డి ఈ ఫేక్ అకౌంట్ల వ్యవహారానికి తెరలేపారన్నారు. ఈ ఫేక్ అకౌంట్లపై తక్షణమే విచారణ చేపట్టాలని హరీశ్ డిమాండ్ చేశారు. లేదంటే ముఖ్యమంత్రి వ్యవహారంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామని ఆయన హెచ్చరించారు.
కాగా, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను బీఆర్ఎస్ నేతలు కులం పేరుతో అవమానించినందుకు కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ఫాంహౌస్ వద్ద నిరసనలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే, దళితులు అక్కడికి వచ్చినందుకు బీఆర్ఎస్ నేతలు ఆ ప్రదేశాన్ని పసుపునీళ్లతో శుద్ధి చేశారని రేవంత్ రెడ్డి శాసనసభలో ఆరోపించారు. కేసీఆర్ ఆదేశాల మేరకే ఈ విధంగా చేసినట్లు అంతర్జాతీయ బీఆర్ఎస్ కార్యదర్శి సంధ్యారావు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసినట్లు రేవంత్ ఆరోపించారు. ఆయన ఆరోపణలకు ఆధారంగా సంధ్యారావు పోస్ట్‌కు సంబంధించిన స్ర్కీన్ షాట్ జిరాక్స్ కాపీని అసెంబ్లీలో చదివి వినిపించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
అంతర్జాతీయ అనిశ్చితులు.. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు
ఈసీఐ వెబ్‌సైట్‌లో ‘సర్’ నోటీసులు
Read Latest AP News And Telangana News