Share News

గజ్వేల్‌లో ఘనంగా ఇఫ్తార్ విందు.. కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్ రావు విమర్శలు

ABN , Publish Date - Mar 13 , 2026 | 08:24 PM

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మదీనా మసీదులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. వివరాల్లోకి వెళితే..

గజ్వేల్‌లో ఘనంగా ఇఫ్తార్ విందు.. కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్ రావు విమర్శలు
Harish Rao Iftar Gajwel

గజ్వేల్, మార్చి 13: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మదీనా మసీదులో బీఆర్ఎస్ (BRS) పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు, గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ‘ముస్లిం సోదరులకు రంజాన్ అత్యంత ప్రాముఖ్యమైన మాసం. ఆకలితో అలమటించే పేదవారి కడుపు బాధ ఎలా ఉంటుందో ఈ ఉపవాస దీక్షల ద్వారా ప్రతి ఒక్కరికీ అర్థమవుతుందని’ అన్నారు.


ప్రస్తుతం పశ్చిమాసియా‌లో నెలకొన్న పరిస్థితులపై స్పందిస్తూ.. ‘గల్ఫ్ దేశాలలో యుద్ధ వాతావరణం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక భారం విపరీతంగా పెరిగిపోతోంది. దీని వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. భవిష్యత్ లో పెట్రోల్ ధరలు పెరగడమే కాకుండా గ్యాస్ సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉంది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ముస్లిం సోదరుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం సోదరుల సంక్షేమం కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. గజ్వేల్ అభివృద్ధి కోసం ఇచ్చిన నిధులు తిరిగి వెనక్కి తీసుకుంది. కొత్త నిధులు ఇవ్వాల్సింది పోయి, ఉన్న నిధులు లాక్కోవడం దారుణం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ముస్లిం సోదరుల సంక్షేమం కోసం కట్టుబడి ఉంటామని’ అన్నారు.


ఇవి కూడా చదవండి

గ్యాస్ కొరత ఎఫెక్ట్: ఏపీలో హోటళ్ల పనివేళల తగ్గింపు? మంత్రి పయ్యావులతో అసోసియేషన్ భేటీ

పలాసలో తొలి కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతం

Updated Date - Mar 13 , 2026 | 09:51 PM