పలాసలో తొలి కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతం
ABN , Publish Date - Mar 13 , 2026 | 05:59 PM
శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో నిర్వహించిన కిడ్నీ మార్పిడి తొలి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. యువతి హేమశ్రీకి వైద్యులు కిడ్నీ రీ ప్లాంటేషన్ చేశారు.
శ్రీకాకుళం, మార్చి 13: జిల్లాలోని పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో నిర్వహించిన తొలి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం అయ్యింది. యువతి హేమశ్రీకి వైద్యులు కిడ్నీ రీ ప్లాంటేషన్ చేశారు. ఈ శస్త్ర చికిత్స పూర్తయిన తర్వాత హేమశ్రీతోపాటు ఆమె తండ్రిని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే శిరీష మాట్లాడుతూ.. చాలా కాలంగా ఉద్దానాన్ని కిడ్నీ భూతం ఇబ్బంది పెడుతోందని తెలిపారు.
అలాంటిది ఈరోజు(శుక్రవారం) పలాసలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతం కావడంతో తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. మారుమూల ప్రాంతంలోని నిరుపేద యువతి కిడ్నీ సమస్యతో బాధపడుతుందని చెప్పారు. ఆమెకు ప్రముఖ వైద్యులంతా వచ్చి ఈ శస్త్రచికిత్స నిర్వహించారని చెప్పుకొచ్చారు.
ఉద్దానంలో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారందరికీ ఈ వైద్యులంతా ఒక నమ్మకాన్ని కలిగించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్యే శిరీష కృతజ్ఞతలు తెలిపారు. 2018లో తుపాన్ సమయంలో సీఎం చంద్రబాబు పలాసలోనే 18 రోజులపాటు ఉన్నారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తుపాన్ వచ్చిందని డొనేషన్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన వారికి ఇక్కడ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పారని ఎమ్మెల్యే గౌతు శిరీష వెల్లడించారు.