ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విద్యుత్ శాఖ డీఈ వెంకటరమణ అరెస్ట్
ABN , Publish Date - Jul 22 , 2026 | 09:29 PM
ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో విద్యుత్ శాఖ డీఈ ముత్యం వెంకట రమణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన సోదాల్లో కోట్ల రూపాయల విలువైన ఆస్తులు వెలుగులోకి వచ్చాయి.
హైదరాబాద్, జులై 22: ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై విద్యుత్ శాఖ డీఈ ముత్యం వెంకట రమణను అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసం, కార్యాలయంతో పాటు బంధువులు, అనుచరులు, బినామీలకు చెందిన మొత్తం 9 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.27.65 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
శేరిలింగంపల్లి, కూకట్‌పల్లిలో 4 ఫ్లాట్లు, అంజనేయనగర్‌లో జీ ప్లస్-3 కమర్షియల్ భవనం, గుత్తాల బేగంపేట్‌లో జీ ప్లస్-5 కమర్షియల్ భవనాలు ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఆయన భార్య పేరుతో నమోదైన నాలుగు నిర్మాణ సంస్థల ద్వారా భారీ పెట్టుబడులు పెట్టినట్లు దర్యాప్తులో తేలిందని ఏసీబీ వెల్లడించింది. అంజనేయనగర్, మూసాపేట్ ప్రాంతాల్లో 10 అపార్ట్‌మెంట్లు నిర్మించినట్లు, వాటి నిర్మాణ విలువ సుమారు రూ.20 కోట్లుగా అంచనా వేసినట్లు అధికారులు తెలిపారు.
సోదాల్లో బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.52.02 లక్షల నగదుతో పాటు 2,094 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. కియా, మహీంద్రా, బలెనో కార్లు సహా మూడు వాహనాలు, సుమారు రూ.30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు, 19 విదేశీ మద్యం సీసాలు, ఒక ఐఎంఎఫ్‌ఎల్ మద్యం సీసాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
వెంకట రమణ 2019లో రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ ట్రాప్‌లో చిక్కుకున్నారని, ఆ కేసులో ఇప్పటికే ఛార్జ్‌షీట్ కూడా దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. అప్పట్లో స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం విలువను కూడా కలుపుకుంటే ఆయనకు సంబంధించిన మొత్తం అక్రమ ఆస్తుల విలువ రూ.28.14 కోట్లకు చేరిందని ఏసీబీ వెల్లడించింది. ప్రస్తుతం ఆయనను కోర్టులో హాజరుపరిచి తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఘనంగా గాడిదలకు పెళ్లి ?.. వీడియో వైరల్
లాఠీఛార్జ్‌లో తీవ్రంగా గాయపడిన యువకుడు.. అంతలో తల్లి నుంచి ఫోన్.. వీడియో వైరల్
For More TG News And Telugu News