Share News

ఘనంగా గాడిదలకు పెళ్లి ?.. వీడియో వైరల్

ABN , Publish Date - Jul 22 , 2026 | 04:29 PM

నైరుతి రుతు పవనాలు ప్రవేశించి నెల గడిచినా.. వానలు లేవు. దీంతో వాన చినుకు కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అలాంటి వేళ.. ఆ గ్రామస్థులు పాత పద్దతిని తెరపైకి తీసుకొచ్చారు. ఆ వీడియో వైరల్ అవుతుంది.

ఘనంగా గాడిదలకు పెళ్లి ?.. వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: నైరుతి రుతుపవనాలు ప్రవేశించి నెల గడిచినా వర్షపు చినుకు అతి గతి లేదు. మరికొన్ని రోజుల్లో జులై మాసం కూడా వెళ్లిపోతుంది. పంట వేసిన రైతు.. వాన చినుకు కోసం ఆకాశం వైపు ఆశగా చూస్తున్నాడు. కానీ చినుకు జాడ మాత్రం కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం చాలా తక్కువగా ఉంటుందని ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఆరు తడి పంటలు వేసుకోవాలని రైతులకు సూచించాయి. ఆ పంటలు వేయాలన్నా.. కొంచెమైనా నీరు ఉండాలి. మరో వైపు భూగర్భ జలాలు అడుగంటాయి. ఆ నీరు కూడా లేకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. దీంతో వానలు కోసం, పాత పద్దతులను, గ్రామస్థులు అవలంభిస్తున్నారు.


ఆ వీడియో వైరల్ అవుతుంది. గతంలో వానలు కురవకుంటే.. గ్రామాల్లో కప్పలకు, గాడిదలకు పెళ్లి చేసే వారు. అలా చేస్తే.. వానలు కురుస్తాయని వారు విశ్వసిస్తారు. ఆ ఆశతో ఆంధ్రప్రదేశ్‌లోని కుర్లపల్లిలో గ్రామస్థులు రెండు గాడిదలకు వైభవంగా వివాహం జరిపించారు. వాటిని పెళ్లికొడుకు, పెళ్లికూతురులా అలంకరించారు. మేళ తాళాలతో పెళ్లి ఊరేగింపు కూడా నిర్వహించారు. ఇక గ్రామస్థులు కూడా తమదైన శైలిలో ఆ జంటకు స్వాగతం పలికారు. వాటికి ఆహ్వానం పలుకుతూ.. బిందెలతో రహదారిపై నీళ్లు పోస్తున్నారు. ఆ జంట గాడిదల వెనుక ప్రజలు భారీగా తరలి వస్తున్నారు.


రాయలసీమ కరవు పీడిత ప్రాంతం. ఇక్కడ గాడిదలకు వివాహం చేసే సంప్రదాయం చాలా కాలంగా ఉంది. ఈ వీడియోను @KP_Aashish ఎక్స్ పేజీలో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఎల్ నినో ప్రభావం అని కొందరు పేర్కొంటే.. పచ్చని చెట్లు తగ్గిపోతున్నాయని మరికొందరు ఆందోళన చెందుతున్నారు. ప్రకృతికి హాని కలిగిస్తే.. ఇలాంటి ఉపద్రవాలే వస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురుస్తుంటే.. దక్షిణ భారతంలో వరుణ దేవుడు కనిపించకుండా పోయాడని అంటున్నారు.

Updated Date - Jul 22 , 2026 | 05:23 PM