Share News

లాఠీఛార్జ్‌లో తీవ్రంగా గాయపడిన యువకుడు.. అంతలో తల్లి నుంచి ఫోన్.. వీడియో వైరల్

ABN , Publish Date - Jul 22 , 2026 | 03:12 PM

కాక్రోచ్ జనతా పార్టీ పిలుపుతో చలో పార్లమెంట్‌లో పాల్గొన్న యువతపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

లాఠీఛార్జ్‌లో తీవ్రంగా గాయపడిన యువకుడు.. అంతలో తల్లి నుంచి ఫోన్.. వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: నీట్ ప్రశ్నపత్రం లీక్, విద్యావ్యవస్థలోని లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) డిమాండ్ చేస్తోంది. అందుకు నిరసనగా జులై 20న ‘చలో పార్లమెంట్’కు పిలుపునిచ్చింది. దీనికి అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. అయినా సీజేపీ చేపట్టిన చలో పార్లమెంట్‌లో భారీగా యువత పాల్గొంది. ఎక్కడికక్కడ వీరిని నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో యువతపై పోలీసులు లాఠీఛార్జ్ చేస్తే.. ప్రతిగా యువకులు రాళ్లురువ్వారు. ఈ నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో పలువురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఓ వీడియో వైరల్ సోషల్ మీడియాలో అవుతోంది.


వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. పోలీసులు లాఠీలు ఝుళిపించడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడు నడవలేని స్థితిలో ఉన్నాడు. అక్కడున్న పలువురు యువకులు అతడికి తాగేందుకు నీరిచ్చి సాయం చేసేందుకు ముందుకువచ్చారు. అదే సమయంలో తల్లి నుంచి అతడికి ఫోన్ కాల్ వచ్చింది. ఈ సందర్భంగా తనకు ఏమీ కాలేదని.. కంగారు పడవద్దని తల్లితో చెప్పాడు. బిగ్గరగా నినాదాలు చేయడం వల్ల స్పష్టంగా మాట్లాడలేక పోతున్నానని తెలిపాడు. తర్వాత ఫోన్ చేస్తానంటూ ఆ ఫోన్‌ను కట్ చేసేశాడు. లాఠీఛార్జ్‌లో తీవ్రంగా గాయపడినప్పటికీ.. అతడు తల్లితో మాట్లాడిన తీరు అందరిని కదిలిస్తోంది.

ఈ దృశ్యంపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. తమ న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్న యువతపై ఇంతటి అమానుష చర్య ఎందుకు అని కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో విద్యార్థుల పోరాటాన్ని.. అదే సమయంలో వారిపై తల్లిదండ్రుల ప్రేమను వెలుగులోకి తీసుకువస్తోందని మరికొందరు స్పష్టం చేస్తున్నారు.

Updated Date - Jul 22 , 2026 | 04:06 PM