BJP Srinivas Reddy: రాజేంద్రనగర్‌ను హైదరాబాద్‌లో కలపొద్దు..
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:12 AM
రాజేంద్రనగర్‌ను హైదరాబాద్‌లో కలపొద్దు.., శివారు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను విభజించి తీసుకొస్తున్న కార్పొరేషన్లను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
- బీజేపీ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్: శివారు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను విభజించి తీసుకొస్తున్న కార్పొరేషన్లను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని మైలార్‌దేవుపల్లి కార్పొరేటర్, బీజేపీ రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇన్‌చార్జి తోకల శ్రీనివాస్‌రెడ్డి(Tokala Srinivas Reddy) అన్నారు. శుక్రవారం కాటేదాన్‌లోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్‌లో డివిజన్లు, జోన్లు, హైదరాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు మజ్లిస్ పార్టీకి అనుకూలంగా ఉండేలా చేస్తోందన్నారు. ఈ విధానాన్ని బీజేపీ తీవ్రంగ వ్యతిరేకిస్తోందన్నారు.
మైలార్‌దేవుపల్లి డివిజన్‌ను రెండుగా చీల్చి మజ్లిస్‌కు అనుకూలంగా మార్చారన్నారు. నాలుగు డివిజన్లు కావాల్సిన శంషాబాద్ ప్రాంతాన్ని కేవలం రెండు డివిజన్లు మాత్ర మే చేశారన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ప్రాంతాలను కలిపి రాజేంద్రనగర్ జోన్‌గా చేసి, సైబరాబాద్‌లో కలపాల్సింది పోయి హైదరాబాద్ కార్పొరేషన్‌లో కలపడానికి కుట్ర చేస్తున్నారన్నారు. అది మజ్లిస్ పార్టీకి అనుకూలం కోసమే చేస్తున్న కుట్ర అని గుర్తు చేశారు.
300 డివిజన్లను ఒకే కార్పొరేషన్‌గా ఉంచాలని, లేని పక్షంలో 100 డివిజన్‌ల చొప్పున మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని తోకల శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్ర భుత్వానికి, ముఖ్యమంత్రికి మజ్లిస్ పైన అంత ప్రేమ ఉంటే 100 డివిజన్లతో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి వారికి అప్పజెప్పాలన్నారు. అలా కాకుండా రాజేంద్రనగర్ ప్రాంతాన్ని హైదరాబాద్ కార్పొరేషన్‌లో కలపాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. రాజేంద్రనగర్ జోన్లు హైదరాబాద్‌లో కలుపుతున్నా, పోలీస్ డివిజన్లను హైదరాబాద్‌లో కలిపినా నోరు మెదపని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ మనకు అవసరమాని ప్రజలను ప్రశ్నించారు.

రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రాంతాన్ని హైదరాబాద్ కార్పొరేషన్‌లో, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో కలుపుతుంటే అసెంబ్లీలో నోరు మెదపని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అసెంబ్లీ జరుగుతున్న సమయంలో విదేశాలకు వెళ్లడం బాధాకరమన్నారు. నియోజకవర్గం ప్రజల సమస్యలపై మాట్లాడని ఎమ్మెల్యే ఎందుకని ప్రశ్నించారు. ఇప్పటికైన ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ నోరు విప్పాలన్నారు. రాజేంద్రనగర్ జోన్‌ను సైబరాబాద్ కార్పొరేషన్‌లోనే కలపాలని, పోలీస్ డివిజన్లను కూడా సైబరాబాద్‌లోనే ఉంచాలన్నారు. దీనిపై అన్ని పార్టీలతో కలిసి ప్రజా ఉద్యమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు జోగి రవి, అడికె జనార్ధన్, రావుల భాస్కర్, పి.సంతుగౌడ్, సి.బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
ప్రతి ఏటా పోలీస్ రిక్రూట్‌మెంట్
Read Latest Telangana News and National News