ప్రతి రైతూ సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేయాలి: కె.నారాయణ
ABN , Publish Date - Jan 20 , 2026 | 01:47 PM
పంట పొలాల్లో కెమికల్స్‌తో కూడిన ఎరువులు వాడటం వల్ల నేల విషంగా మారుతుంది. రైతులు పాత పద్దతిలో సేంద్రియ ఎరువులు వాడాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సూచించారు. ఎరువుల కంపెనీలన్నీ బడా బాబుల చేతుల్లో ఉన్నాయంటూ విమర్శించారు.
ఖమ్మం జిల్లా, ఆంధ్రజ్యోతి 20: నేలకొండపల్లిలో సిద్దార్థ యోగ విద్యాలయంలో సేంద్రియ వ్యవసాయంపై రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు సీపీఐ (CPI) జాతీయ కార్యదర్శి కె.నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో రసాయన ఎరువులు, పురుగుల మందులు అధికంగా వాడటం వల్ల నేల విషతుల్యమవుతోందన్నారు. దీని వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని చెప్పారు. ప్రతి రైతూ గతంలో మాదిరిగా సేంద్రియ సాగు వైపు దృష్టి సారించాలని చెప్పారు.
దేశంలో అత్యంత సారవంతమైన భూములు ఉన్నాయని నారాయణ అన్నారు. ఇక్కడ చదువుకున్న యువత ఇతర దేశాలకు వెళ్లి పనిచేస్తున్నారని చెప్పారు. ఇక్కడ మనకు అన్నీ ఉన్నాయని, కానీ ఇంకా కరువులోనే బతుకుతున్నామని తెలిపారు. విత్తనాలు, ఎరువు కంపెనీలు బడా బాబులవే అని.. అవి కొనడం వల్ల కార్పొరేట్ కంపెనీలు లాభపడుతున్నాయని చెప్పారు. చిన్న జీయర్ స్వామి సమాజం బాగుండాలని ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. తన చివరి ఊపిరి ఉన్నంత వరకు కమ్యూనిస్టు పార్టీలోనే పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.
భూమికి విరామం ఇద్దాం: జీయర్ స్వామి

సేంద్రియ వ్యవసాయంపై రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో త్రిదండి శ్రీమన్నారాయణ జీయర్ స్వామి పాల్గొని ప్రసంగించారు. సుపల అనేది భూమి పేరని.. భూమి పవిత్రతను నిలబెట్టే స్థితిని కల్పించాలన్నారు. పంట ఇస్తోందని భూమిలో నాలుగు పంటలు పండిస్తే త్రాగడానికి నీరు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందని వెల్లడించారు. అత్యాశ వల్ల సమూల నాశనం జరుగుతుందని చెప్పుకొచ్చారు. కావలసినవి ఇవ్వగలిగే శక్తి భూమికి ఉందని అన్నారు. మనిషికి ఆలోచన చెడితే విషం అవుతుందన్నారు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. ఆవులను పాచ్యాత్య దేశాల వారు పాల కోసమే పెంచుతారని.. భారతదేశంలో కూడా రైతులు అదే బాటలో పయనిస్తున్నారని.. వాటివల్ల పశువులు రోగాల బారిన పడ్డాయన్నారు. వస్తువులను హైబ్రిడ్ అని పెంచడం వల్ల అనేక మంది రోగాల బారిన పడుతున్నారని ఆయన అన్నారు.
ఈరోజు తినే ఆహారం అంతా కలుషితమే అని వెల్లడించారు. ప్రతి వస్తువులోనూ దేవుడు ఉన్నాడని.. ప్రకృతి బాగుంటేనే మనుష్యులు జీవించగలరని స్పష్టం చేశారు. గతంలో క్యాన్సర్ అనేది వినిపించేది కాదని.. ఇప్పుడు ప్రతి ఊర్లో వినిపిస్తోందన్నారు. మనం పండించే పంట, జీవించే విధానమే రోగాలన్నింటికీ కారణమన్నారు. ప్రకృతి వనరులను నాశనం చేస్తే మనిషి మనుగడ కష్టం అవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ సర్వప్రాణి సేవ చేయాలని.. భూమికి కూడా ప్రాణం ఉంటుందని... దానికి కూడా విరామం ఇవ్వాలని త్రిదండి శ్రీమన్నారాయణ జీయర్ స్వామి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
డైవర్షన్ కోసమే నోటీసులు.. సీఎం రేవంత్‌పై హరీశ్ ఫైర్
దారుణం... తల్లిపై కొడుకు కత్తితో దాడి
Read Latest Telangana News And Telugu News