పత్తి చేతికొచ్చేనా?
ABN , Publish Date - Oct 22 , 2026 | 02:26 AM
పత్తిరైతులు తలపట్టుకుంటున్నారు.. పెట్టిన పెట్టుబడి అయినా చేతికొస్తుందో లేదోనని రంది పడుతున్నారు.
ఎల్‌నినో ప్రభావంతో 30-40 శాతం తగ్గనున్న దిగుబడి
పక్వానికి ముందే పగులుతున్న కాయలు..
నాణ్యతపై దెబ్బ వాన పడకపోతే మరింత నష్టం..
బోర్ల కింద కాస్త నయం కరెంటు కోతలతోనే సమస్య
నిరంతరాయంగా 9 గంటల విద్యుత్తు లేకపోవడంతో తడవని చేలు
మరో 2-3 తడులైనా కావాలి
రసం పీల్చే పురుగు, ఎర్రబొంగుతెగులు మరో సమస్య
దిగుబడి రాదేమోనన్న బెంగతో ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరి ఆత్మహత్య
అప్పుల బాధతో మరో రైతు కూడా..
నెలరోజులుగా వానల జాడలేదు. కాత, పూత రాలిపోతోంది. ఆదిలాబాద్ జిల్లాలో 4.26 లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేస్తే ఎకరానికి 10-12 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని రైతులు ఆశించారు. 50 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనావేశారు. ప్రస్తుతం 6-7 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితిలేదని రైతులు చెబుతున్నారు. నిర్మల్‌లో సాగు విస్తీర్ణం పెరిగింది. దిగుబడి మాత్రం తగ్గుతోంది.
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్) పత్తిరైతులు తలపట్టుకుంటున్నారు.. పెట్టిన పెట్టుబడి అయినా చేతికొస్తుందో లేదోనని రంది పడుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేయడం, మండుతున్న ఎండలు... కరెంటు కోతలు... సాగునీటి కొరత కారణంగా పత్తి పంట చేతికి రావడం ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుత పరిస్థితులు ఇలానే కొనసాగితే ఎకరానికి 30-40ు దాకా దిగుబడి పడిపోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సాధారణ పరిస్థితుల్లో ఎకరానికి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, ఇప్పుడు 6 నుంచి 7 క్వింటాళ్లు మాత్రమే వచ్చే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఇదే జరిగితే ఎకరానికి రూ.30-40 వేల దాకా ఆ రైతులు నష్టపోయే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో పత్తి సాధారణ విస్తీర్ణం 47,41,541 ఎకరాలు అయితే నిరుడు 45,99,520 ఎకరాల్లో పత్తి పంట సాగైంది. ఈసారి 48,33,112 ఎకరాల్లో పత్తి సాగుచేశారు. సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే 2 శాతం ఎక్కువగా పంట సాగైంది. నిరుటితో పోలిస్తే 2,33,592 ఎకరాల్లో పత్తి విస్తీర్ణం పెరిగింది.
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా 17 శాతం లోటు వర్షపాతం ఏర్పడింది. వర్షాలు పడకపోగా, 35-37 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రస్తుతం పంట తీవ్రంగా దెబ్బతింటోంది. పత్తి కాయలు పక్వానికి ముందే పగిలిపోతున్నాయి. ఫలితంగా పత్తి దిగుబడి, నాణ్యత తగ్గే ప్రమాదం నెలకొంది. ఈ దశలో నీటి అవసరంచాలా ఉంటుంది. కనీసం 2-3 తడులు అందితే పత్తిపంట గట్టెక్కే పరిస్థితులున్నాయి. బోర్లు, బావులు ఉన్నచోట పత్తి పంట పరిస్థితి కాస్త నయం. వర్షాధారంగా సాగుచేసిన చోట్ల పంటలు ఎండిపోతున్నాయి. కరెంటు కోతలు బాగా పెరిగాయి. రోజుకు 9 గంటలు క్రమంతప్పకుండా విద్యుత్తు సరఫరా కావడం లేదు. ఫలితంగా నీరు చేలకు సరిగా అందడం లేదు ఉదయం ఆరింటి నుంచి సాయం త్రం ఆరింటిదాకా నిరంతరాయంగా 12గంటలు సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కాగా గాలిలో తేమ, నీటిసరఫరా లేకపోవటం, ఎండ లు ఎక్కువగా ఉండటంతో పత్తి పంటపై ఈసారి రసంపీల్చే పురుగు దాడిచేస్తోంది. సెప్టెంబరులో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాక ఒక్కసారిగా వర్షం పడటంతో పత్తి పంటపై ప్రభావం పడి ఎర్రబొంగు రోగం వచ్చింది. ఎర్రనేలలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది.
ఆదిలాబాద్ జిల్లాలో నెలరోజులుగా వానల జాడలేదు. కాత, పూత రాలిపోతోంది. 4.26 లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేస్తే ఎకరానికి 10-12 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని రైతులు ఆశించారు. 50 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనావేశారు. ప్రస్తుతం 6-7 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితిలేదని రైతులు చెబుతున్నారు. నిర్మల్‌లో సాగు విస్తీర్ణం పెరిగింది. దిగుబడి మాత్రం తగ్గుతోంది.
ఖమ్మం జిల్లాలో 2,35,637 ఎకరాల్లో రైతులు పత్తి సాగుచేశారు. ఎల్‌నినో ప్రభావంతో ఎకరానికి 5 క్వింటాళ్ల నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తుందని రైతులు తెలిపారు. పంట ఎర్రబారటం, పత్తికాయ గిడసబారిపోవటం, వేడిగాలులతో పత్తిలో తేజస్సు తగ్గిపోయింది.
కొత్తగూడెం జిల్లాలో 2.20 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఎకరానికి 12 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని రైతులు ఆశించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పూత, కాత రాలిపోవటంతో 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని తెలిపారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11.50 లక్షల ఎకరాల నుంచి 8.13 లక్షల ఎకరాలకు పత్తి విస్తీర్ణం పడిపోయింది. ఇక్కడ ఎకరానికి 4 క్వింటాళ్ల వరకే దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. 13.80 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని మొదట భావించినా... 40 శాతం తగ్గేలాఉంది.
కామారెడ్డి జిల్లాలో 45,864 ఎకరాల్లో పత్తి సాగైంది. ఎండల తీవ్రతతో పంట దెబ్బతింటోంది. కొన్నిచోట్ల ఎండిపోతోంది. ఎకరానికి 10 నుంచి 13 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని బిచ్కుంద, జుక్కల్ పత్తి రైతులు చెబుతున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో పత్తి విస్తీర్ణం తగ్గింది. నిరుడు 8,13,392 ఎకరాల్లో పత్తి సాగైంది. ఈసారి 45 శాతం విస్తీర్ణం తగ్గి 4,54,874 ఎకరాల్లో సాగుచేశారు. జూన్, జులై నెలల్లో వర్షాలు పడకపోవటంతో మొక్కదశలోనే కొందరు రైతులు దున్నేశారు. కొందరు సెప్టెంబరు నెలవరకు ఎదురుచూసినా 80ు లోటు వర్షపాతం ఏర్పడటంతో పత్తి తీసి చెలకలు వదిలేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పత్తి సాగు గతానికంటే ఎక్కువ పెరిగింది. ప్రతికూల వాతావరణం కారణంగా 50 శాతం దిగుబడి తగ్గుతుందని రైతు లు తెలిపారు. మార్కెట్లో పత్తికి మంచి ధరలు పలుకుతున్న తరుణంలో దిగుబడి తగ్గటం ఆందోళనకరంగా ఉందిని రైతులు చెబుతున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పత్తి సాగు పెరిగింది. దిగుబడి మాత్రం తగ్గుతోంది. వర్షాభావ పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.
సబ్ స్టేషన్లను ముట్టడిస్తున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. పత్తి, సోయా పంటల రైతులు ఎల్‌నినో దెబ్బకు కుంగిపోతున్నారు. పంటలకు సాగునీరు అందకపోగా 35-37డిగ్రీల దాకా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 20ు ఆయకట్టుకు మాత్రమే సాగునీరు అందుతోంది. మిగతాచోట్ల వర్షాధారంగానే సాగు చేస్తున్నారు. జిల్లా సరిహద్దుల్లో ప్రవహిస్తున్న పెన్‌గంగా నది అడుగంటిపోయింది. చెరువులు కుంటలు ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వలు భారీగా పడిపోతున్నాయి. భూగర్భ జలాలు వేగంగా అడుగంటుకపోవడంతో నీటి ఎద్దడి తీవ్రమవుతోంది. గత 15 రోజుల్లో.. దిగుబడులు రావన్న బెంగతో ఇద్దరు రైతులు, అప్పుల బాధతో మరో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జిల్లాలో తలమడుగు మండలం మినహా అన్ని మండలాల్లో లోటు వర్షపాతమే కనిపిస్తోంది. అడ్డగోలు కరెంటు కోతలతో పంటలకు నీరు అందడం లేదని ఆరోపిస్తూ రైతులు విద్యుత్తు సబ్ స్టేషన్ల వద్ద ఆందోళనలకు దిగుతున్నారు. జిల్లాలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎర్రవెల్లిలో మాజీ సీఎం కేసీఆర్ నివాసంలో ఘనంగా దసరా వేడుకలు