Share News

ఏరులై పారిన మద్యం

ABN , Publish Date - Oct 22 , 2026 | 01:08 AM

దసరా పండుగ వేళ మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. దసరా పండుగ.. మూడు రోజుల సందడిగా మారింది. పల్లెల్లో విందులు.. మద్యం విక్రయాలతో దసరా సందడిగా మారింది. జిల్లా

ఏరులై పారిన మద్యం

పెద్దపల్లి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): దసరా పండుగ వేళ మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. దసరా పండుగ.. మూడు రోజుల సందడిగా మారింది. పల్లెల్లో విందులు.. మద్యం విక్రయాలతో దసరా సందడిగా మారింది. జిల్లా వ్యాప్తంగా మంగళవారం దసరా పండుగ, బుధవారం దుర్గాదేవీ, భవాని మాత నిమజ్జన కార్యక్రమాలు, గురువారం దీక్షల విరమణ అనంతరం వేడుకలు జరుపుకునేలా పలువురు తమ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో పండుగ సందడి ఒక్కరోజుకే పరిమితం కాకుండా మూడు రోజుల పాటు కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా దసరాకు ముందే మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి.

ఫ విందుల సందడి

దసరా పండుగ మంగళవారం రావడంతో కొందరు మరుసటి రోజుకు విందులను వాయిదా వేసుకున్నారు. దేవీ నవరాత్రుల సందర్భంగా దీక్షలో ఉన్నవారు నిమజ్జన కార్యక్రమాలు పూర్తయ్యే వరకు నియమాలు పాటించి, అనంతరం వేడుకలు జరుపుకొనేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో మంగళ, బుధ, గురువారాల్లో దశలవారీగా పండుగ సంబరాలు నిర్వహించే పరిస్థితి ఏర్పడింది. పెద్దపల్లి, రామగుండం, సుల్తానాబాద్‌, మంథని పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ పండుగ సందడి ఈ సారి ఎక్కువగా ఉంది. ఉద్యోగాలు, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు సొంతూళ్లకు చేరుకోవడం, బంధుమిత్రుల కలయికలు, కుటుంబ వేడుకలు నిర్వహించు కోవడం సాధారణంగా పండుగ వేళ కొనుగోళ్లను పెంచుతాయి. ఈ సారి మూడు రోజుల పాటు వేడుకలు కొనసాగుతున్న నేపథ్యంలో మద్యం విక్రయాలపైనా ప్రభావం చూపింది. పండుగకు రెండు మూడు రోజుల ముందు నుంచే గ్రామాలు పట్టణాల్లో పండుగ సందడి నెలకొంది. సద్దుల బతుకమ్మ సంబరాల కోసం కుటుంబ సభ్యులు బంధువులు ఇళ్లకు చేరుకోవడంతో విందులు ప్రారంభం అయ్యాయి. ప్రతీ విందు మద్యం మాంసంతో కూడుకుని ఉండడం తెలంగాణలో ఆనవాయితీ. దాంతో మద్యం అమ్మకాలు పెద్ద ఎత్తున సాగాయి. పండుగను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ బ్రేవరేజస్‌ కార్పొరేషన్‌ సంస్థ డిపోలు మద్యం దుకాణాలకు సరిపడా నిల్వలు ఉంచాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

ఫ జిల్లాలో 74 వైన్‌ షాపులు, 15 బార్లు

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మొత్తం 74 వైన్‌ షాపులున్నాయి. రామగుండం కార్పొరేషన్‌ పరిధితో పాటు పెద్దపల్లి జిల్లా కేంద్రం, మంథని సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలు తదితర ప్రధాన పట్టణాల్లో 15 బార్‌ అండ్‌ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటి ద్వారా దసరాకు ముందు రెండు రోజులలో ఆ తర్వాత మరో రెండు రోజుల్లో అంటే కేవలం నాలుగు రోజుల్లోనే తెలంగాణ బ్రూవరీస్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.15 కోట్ల మద్యం నిల్వలు షాపులకు చేరుకున్నాయి. అక్టోబరు 1 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ. 1,951 కోట్ల విలువైన మద్యం విక్రయాలు నమోదయ్యాయి. గతేడాది ఇదే వ్యవధిలో రూ. 1,311 కోట్ల అమ్మకాలు జరుగగా ఈ సారి 35 శాతం వృద్ధి నమోదైనట్లు ఎక్సైజ్‌ శాఖ లెక్కలు తెలుపుతున్నాయి.

ఫ బెల్ట్‌షాపుల్లో ఏరులై పారిన మద్యం

దసరా పండుగ సందర్భంగా గత వారం రోజుల నుంచి జిల్లాలోని పలు మండలాల్లో ఉన్న బెల్ట్‌ షాపులలో మద్యం ఏరులై పారింది. ఈ షాపులలో 24 గంటలు మద్యం అందుబాటులో ఉండడంతో గ్రామాలలో ప్రశాంత వాతావరణం కొరవడింది. సుల్తానాబాద్‌ ప్రాంతంలోని బెల్ట్‌షాపుల నిర్వాహకులకు వైన్‌ షాపుల వారు ఎమ్మార్పీ కన్నా అదనంగా వసూలు చేసి విక్రయిస్తున్నారు. బెల్ట్‌షాపుల్లో మరింత ఆదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.

Updated Date - Oct 22 , 2026 | 01:08 AM