Share News

త్యాగం అంటే కేవలం ఎలక్షన్, సెలక్షన్, కలెక్షన్.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ ధ్వజం

ABN , Publish Date - Jun 28 , 2026 | 07:10 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భారత్ రాష్ట్ర సమితి లక్ష్యంగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలు చెప్పుకునే ‘త్యాగాల’ వెనుక అసలు నిజాలను నిలదీస్తూ, వారి పదేళ్ల పాలనలో జరిగిన విధ్వంసాన్ని ఎండగట్టారు.

త్యాగం అంటే కేవలం ఎలక్షన్, సెలక్షన్, కలెక్షన్.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ ధ్వజం
Telangana Politics

నల్లగొండ, జూన్ 28: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు(ఆదివారం) నల్లగొండ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ.. భారత్ రాష్ట్ర సమితి పార్టీపై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ నిఘంటువులో త్యాగం అంటే కేవలం ఎలక్షన్, సెలక్షన్, కలెక్షనేనని ఎద్దేవా చేశారు. వేలాది మంది అమరవీరుల బలిదానాల పునాదులపై ఏర్పడిన తెలంగాణను, బీఆర్ఎస్ నేతలు తమ సొంత ఖాతాలో వేసుకోవాలని చూడటం హాస్యాస్పదమన్నారు. నిజమైన త్యాగానికి అర్థం కాంగ్రెస్ నేతల్లోనూ, ఉద్యమకారుల్లోనూ కనిపిస్తోందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో వందేళ్లకు సరిపడే విధ్వంసం సృష్టించిందని, అధికారం కోల్పోయామనే అక్కసుతో కేసీఆర్ కుటుంబం ఇప్పుడు రాష్ట్రంపై విషం చిమ్ముతోందని సీఎం ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనకు, తమ ముప్పై నెలల కాంగ్రెస్ పాలనకు మధ్య బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. స్పీకర్‌కు లేఖ రాసి, ఇరు పార్టీల మేనిఫెస్టోలపై సభలోనే ముఖాముఖి నిర్వహిద్దామని పిలుపునిచ్చారు.


ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి 4 కోట్ల మంది ప్రజల ఆశీర్వాదం ఉందన్న సీఎం రేవంత్.. 30 నెలల కాలంలోనే పేదల సంక్షేమం కోసం లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశామని వెల్లడించారు. రాష్ట్రంలో పేదలందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. ఫామ్‌హౌస్‌లో ఉన్న కేసీఆర్ తింటున్నది, తెలంగాణలోని తండాల్లో ఉన్న పేదలు తింటున్నది ఒకే బియ్యమే అన్నారు. అనుమానం ఉంటే కేటీఆర్.. తండాలకు వెళ్లి చూసుకోవచ్చని హితవు పలికారు. అలాగే, మహిళల కష్టాలను తీరుస్తూ కేవలం రూ. 500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని రేవంత్ రెడ్డి గర్వంగా ప్రకటించారు.

కేసీఆర్ కుటుంబానికి మళ్లీ పదవులు ఇచ్చేందుకు తెలంగాణ ప్రజలు ఏమాత్రం సిద్ధంగా లేరని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. త్యాగానికి అసలైన నిర్వచనం చెప్పాలంటే 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్న కొండా లక్ష్మణ్ బాపూజీని గుర్తుచేసుకోవాలన్నారు. అలాగే మలిదశ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం తన పదవిని త్యాగం చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిది అసలైన త్యాగమని కొనియాడారు.


ఈ వార్తలు కూడా చదవండి:

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ధరలు ఇవే..

బంగాళదుంపలు ఉడికించిన నీటిని పారబోస్తున్నారా?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 28 , 2026 | 07:55 PM