Share News

నల్గొండలో హ్యామ్ రోడ్ల ప్రాజెక్టులకు సీఎం రేవంత్ శ్రీకారం

ABN , Publish Date - Jun 28 , 2026 | 04:41 PM

నల్గొండ జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా రూ.13,006 కోట్లతో చేపట్టనున్న హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ రహదారుల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలోని ప్రధాన రహదారుల అనుసంధానం మెరుగుపడటంతో పాటు రవాణా వ్యవస్థ మరింత వేగవంతం కానుంది.

నల్గొండలో హ్యామ్ రోడ్ల ప్రాజెక్టులకు సీఎం రేవంత్ శ్రీకారం
HAM Road Projects

నల్లగొండ, జూన్ 28: తెలంగాణలో రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా కనగల్ ఏఎంసీ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్(HAM) రోడ్ల అభివృద్ధి పనులకు సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.13,006 కోట్ల వ్యయంతో చేపట్టనున్న భారీ రహదారుల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో పాటు ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు జైవీర్ రెడ్డి, బాలు నాయక్, బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తదితరులు పాల్గొన్నారు.


రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 34 ప్యాకేజీల్లో 6,092 కిలోమీటర్ల మేర 441 రహదారులను హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ విధానంలో అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలోని ప్రధాన రహదారుల అనుసంధానం మెరుగుపడటం సహా రవాణా వ్యవస్థ మరింత వేగవంతం కానుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడి ఆర్థిక కార్యకలాపాలకూ ఊతమిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.83 కోట్ల వ్యయంతో చేపట్టనున్న డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్-1 పనులకు శంకుస్థాపన చేశారు. నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా రహదారులు, తాగునీటి వంటి మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన కీలక ప్రాజెక్టులను ప్రారంభించడం ద్వారా రాష్ట్రంలో మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఈ కార్యక్రమాలు స్పష్టం చేస్తున్నాయి.


ఇవి కూడా చదవండి..

హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు.. ధన్యవాదాలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు..

బంగారం ధరలు పెరిగాయ్.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jun 28 , 2026 | 04:46 PM