రెండు ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు ప్రారంభించిన హోంమంత్రి అనిత..
ABN , Publish Date - Jun 28 , 2026 | 01:32 PM
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో హోంమంత్రి వంగలపూడి అనిత, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా బోయపాడు, దొండవాక తీరాల్లో నిర్మించ తలపెట్టిన రెండు ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు.
అనకాపల్లి జిల్లా: పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో హోంమంత్రి వంగలపూడి అనిత, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా బోయపాడు, దొండవాక తీరాల్లో నిర్మించ తలపెట్టిన రెండు ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు. ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలకు భూమిపూజ చేయడంతో కూటమి ప్రభుత్వానికి, హోంమంత్రి అనితకు స్థానిక మత్స్యకారులు ధన్యవాదాలు తెలిపారు.
ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల శంకుస్థాపన అనంతరం బోయపాడులో హోంమంత్రి వంగలపూడి అనిత సభలో ప్రసంగించారు. కొన్ని సంవత్సరాలుగా మత్స్యకార సోదరులు జెట్టి కోసం ఎదురుచూస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఏపీలో మూడు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు వస్తే, పాయకరావుపేట నియోజకవర్గానికి రెండు తీసుకువచ్చామని అనిత తెలిపారు. నియోజకవర్గంలోని మత్స్యకార సోదరులతో తనకు ఎంతో ఆప్యాయత ఉందని చెప్పారు. తాను మత్స్యకార గ్రామంలోనే టీచర్‌గా కూడా పని చేసినట్లు హోంమంత్రి గుర్తు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేశామని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. రెండు సంవత్సరాల కాలంలో సుమారు రూ.600 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు.
ఆర్ అండ్ బీ శాఖ నుంచి రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు కూడా చేశామని అనిత పేర్కొన్నారు. రాజయ్యపేట గ్రామ ప్రజలు తనను అడ్డుకున్నప్పుడు పోలీసులు కేసులు పెట్టాలని సూచించగా.. ఏ ఒక్కరిపైనా పెట్టవద్దని చెప్పినట్లు తెలిపారు. ఎన్నికల వరకే పార్టీలని, ఎన్నికలైన తర్వాత అభివృద్ధి, సంక్షేమమే ముఖ్యమన్నారు. నియోజకవర్గానికి బీసీ వెల్ఫేర్ బాలికల హాస్టల్‌ను తీసుకువచ్చామని, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో తొమ్మిది వేల మత్స్యకార కుటుంబాలు ఉన్నాయని, వారికి మేలు చేసేలా ఈ ఒక్కరోజే రూ.60 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వం మత్స్యకారులకు, వారి గ్రామాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తోందని అనిత చెప్పారు.
మరోవైపు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. 'పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్ధి కోసమే హోంమంత్రి అనిత అనునిత్యం ఆలోచిస్తారు. గొడ్డలి పార్టీ నాయకులు ఐదు సంవత్సరాలు అభివృద్ధి కోసం మాట్లాడారా?. ఇప్పుడు అభివృద్ధిని చూసి ఓర్వలేక, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఏపీలో అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నాం. గత పాలనలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. వేల మత్స్యకార కుటుంబాలకు ఈ జెట్టిలు ఎంతగానో ఉపయోగపడతాయి. గొడ్డలి పార్టీ నాయకులు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. గతంలో అమరావతి రైతులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు రాజధాని పనులకు అడ్డు తగులుతున్నారు. అందుకే ఇలాంటి వైసీపీని 11 స్థానాలకు తీసుకొచ్చి, ప్రజలు రప్పారప్పా ఆడించారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు' అని మండిపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి...
తప్పు ఎవరు చేసినా తప్పే.. కులం ఆధారంగా చూడొద్దు: పవన్ కల్యాణ్
‘రాజధాని ద్రోహి జగన్, గో బ్యాక్’ అంటూ అమరావతి రైతుల నినాదాలు