కాళేశ్వరాన్ని గాలికి వదిలేయం
ABN , Publish Date - Feb 23 , 2026 | 02:48 AM
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ వచ్చే రెండేళ్లలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
అది ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రాజెక్టు.. వినియోగంలోకి తెస్తాం
పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ రెండేళ్లలో పూర్తి చేస్తాం
గత సర్కారు కాళేశ్వరానికే రూ.1.02 లక్షల కోట్లు ఖర్చు చేసింది
మిగతా ప్రాజెక్టుల్ని నిర్లక్ష్యం చేయడంతో భూసేకరణకు ఇబ్బందులు
6వేల కోట్లతో మొదలెట్టిన దేవాదుల 18,500 కోట్లకు చేరింది
గోదావరి జలాల వివాదం రాజకీయ రంగు పులుముకుంది
పదేళ్లలో ప్రాజెక్టులు పూర్తిచేసి ఉంటే ఈ వివాదం వచ్చేదికాదు
కృష్ణా జలాలపై మేము ఏపీకి సహకరిస్తున్నామనేది పచ్చి అబద్ధం
బీఆర్‌ఎస్ నేతలూ శాసనసభకు రండి.. అన్ని అంశాలపై చర్చిద్దాం
2027 డిసెంబరు నాటికి దేవాదుల నిర్మాణం పూర్తి కావాలి
దేవాదులపై సమీక్ష.. మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
వరంగల్/హైదరాబాద్, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ వచ్చే రెండేళ్లలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే రూ.1.02 లక్షల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. నిధులన్నీ ఆ ఒక్క ప్రాజెక్టుకే ఖర్చు చేసి, మిగతా ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడంతో ప్రస్తుతం భూసేకరణకు నిధులు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును గాలికి వదిలేయబోమని, అది ప్రజల సొమ్ముతో నిర్మించినదని అన్నారు. దానిని వినియోగంలోకి తెస్తామని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ పైన కుంగిందని, లోపలి భాగంలో ఏం జరిగిందో అంచనా వేయటానికి సాంకేతిక బృందాలు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. ఏ బ్యారేజీనీ వృథాగా ఉంచబోమన్నారు. ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి.. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, సీతక్కతో కలిసి సందర్శించారు. నేరుగా దేవాదుల ఇన్‌టేక్‌వెల్ వద్దకు వెళ్లి.. గోదావరి జలాల ప్రవాహాన్ని పరిశీలించారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గోదావరి జలాల వివాదం రాజకీయ రంగు పులుముకుందని, గత పదేళ్ల పాలనలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఈ వివాదమే ఉండేది కాదన్నారు. రాష్ట్రంపై రూ.8.11 లక్షల కోట్ల అప్పుల భారం ఉండడంతో.. సాగునీటి ప్రాజెక్టులు 70-80 శాతం పూర్తయినా పెండింగ్ పనులు పూర్తి చేసుకునేందుకు నిధుల కొరత ఉందని చెప్పారు. అయినా.. ఆర్థిక పరిస్థితులను అధిగమించి రాబోయే రెండేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉందన్నారు. 2001లో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు రూ.6 వేల కోట్లతో చేపట్టిన దేవాదుల ప్రాజెక్టుకు ఇప్పటికి రూ.14,500 కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు. అయినా.. ఈ అంచనాలను రూ.18,500 కోట్లకు పెంచాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారని, ఇక్కడితోనైనా దీనికి ఫుల్‌స్టాప్ పెట్టాలని నిర్ణయించామన్నారు.
కాళేశ్వరాన్ని మహాద్భుతం అన్నారు..
కాళేశ్వరం ప్రాజెక్టును గత ప్రభుత్వం మహాద్భుతంగా చూపించిందని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఆ ప్రాజెక్టు నుంచి చుక్కనీరు కూడా ఎత్తిపోయకపోయినా దేశంలో అత్యధికంగా వరిసాగు చేసిన రాష్ట్రంగా తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలను, పంపుహౌ్‌సలను ఏ ఉద్దేశంతో కట్టారో.. ఆ నీళ్లు, నిధులు ఎక్కడికి పోయాయో తాను విమర్శ చేయదలుచుకోలేదన్నారు. అయితే గోదావరి జలాలే కాకుండా కృష్ణా జలాలపైనా అనేక అపోహలు కల్పిస్తున్నారని విమర్శించారు. పక్క రాష్ర్టానికి నీటిని తరలించడానికి తాము సహకరిస్తున్నామంటున్నారని తప్పుబట్టారు. ‘‘కృష్ణా జలాలపై పూర్తి స్థాయి చర్చ శాసనసభలోనే చేపట్టాం. బహిరంగ సభలు పెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలివ్వడం వద్దు. ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగింది? తెలంగాణ వచ్చిన తరువాత కేసీఆర్ హయాంలో హరీశ్‌రావు సాగునీటి మంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగింది? రెండేళ్లుగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగిందో చర్చించేందుకు అసెంబ్లీకి ఆహ్వానిస్తున్నాం. కృష్జా జలాలకు సంబంధించిన అంశాలపై మొన్నటి శాసనసభలో వివరణ ఇచ్చాం. అయినా మీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి మాపై ఆరోపణలు చేయడం సబబు కాదు. మీరు తప్పు చేశారా? లేదా? అన్నది ప్రజలు గుర్తించారు.. శిక్షించారు’’ అని రేవంత్ అన్నారు.

అసెంబ్లీలోనే చర్చ చేద్దాం..
‘‘గోదావరి జలాలపై శాసనసభలో కూర్చుని చర్చ చేద్దాం. మేం ఏదైనా సవరించుకోవాల్సి ఉంటే అందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. పక్క రాష్ట్రానికి నీళ్లు తీసుకెళ్లడానికి మా ప్రభుత్వమే సహకరిస్తోందని ఆరోపిస్తున్నారు. ప్రజా జీవితంలో ఉండి తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన వారు.. ఎవరైనా ఆ పని చేస్తారా? ఏపీ నుంచి వలస వచ్చి ఇక్కడ సెటిలైన వ్యక్తులైనా సహకరిస్తారా? ఇలాంటి చౌకబారు ఆరోపణలతో ప్రయోజనం ఉండదు’’ అని రేవంత్ అన్నారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడి.. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రతి పౌరుడికి తాగునీరు అందించటమే లక్ష్యమని ప్రకటించారు. మేడారం జాతరను దక్షిణాది కుంభమేళాగా నిర్వహించుకున్నామని, చిన్నచిన్న సమస్యలున్నా సరి చేసుకున్నామని తెలిపారు. భక్తులు నిరంతరం దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని, బడ్జెట్ సమావేశాల తరువాత మేడారం వస్తానని అన్నారు. కేసీఆర్ తెలంగాణ సమాజానికి ఉపయోగపడే మంచి పుస్తకాలు చదవాలని, చిన జీయర్‌స్వామి సూక్తులు, మంచి ప్రవచనాలు వినాలని సీఎం రేవంత్ సూచించారు. అంతే తప్ప ప్రజలపై విషం కక్కవద్దన్నారు. తమ వారసత్వ ఆస్తిని ఎవరో కొల్లగొట్టారన్నట్లుగా కడుపులో బాధ పెట్టుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు.
దేవాదుల ప్రాజెక్టుకు రూ.600 కోట్లు..
దేవాదుల ప్రాజెక్టుకు భూసేకరణ కోసం జూన్ 2లోపు రూ.600 కోట్లు మంజూరు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆదివారం ఈ ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. సమ్మక్క బ్యారేజీ ఎంత దూరంలో ఉందని, అక్కడ నిల్వ చేస్తే ఇక్కడి వరకు ఎన్ని టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని ఇంజనీరింగ్ అధికారులను అడిగారు. రూ.2,121 కోట్లతో బ్యారేజీ పూర్తి చేశామని, 6.94 టీఎంసీల నీరు బ్యారేజీలో నిల్వ ఉంటుందని, 300 రోజులు 60 టీఎంసీల వరకు నీటిని లిఫ్టు చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు రూ.14,500 కోట్ల వరకు ఖర్చు చేశామని, ఇంకో రూ.4వేల కోట్ల వరకు నిధులు ఇస్తే, భూసేకరణతో పాటు ఇతర నిర్మాణాలు పూర్తవుతాయని వివరించారు. దీంతో వెంటనే ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కావాల్సిన అంచనాలతో రిపోర్టు ఇవ్వాలని, 2027 డిసెంబరు నాటికి నిర్మాణం పూర్తి చేయాలని సీఎం అన్నారు. మార్చిలో ప్రత్యేక మంత్రివర్గ సమావేశం నిర్వహించి అన్ని అంచనాలకు ఆమోదం తెలుపుతామన్నారు. దేవాదుల పంపుల మరమ్మతులను ను నెలరోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి దేవాదులపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల భూేసకరణ కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని, పరిహారం చెల్లింపులను గ్రీన్ చానల్ ద్వారా వేగంగా మంజూరు చేస్తామని చెప్పారు. రామప్ప చెరువు నుంచి జంపన్న వాగుకు నీరందించే ప్రణాళికపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు మహబూబాబాద్ జిల్లా రెడ్యాలలో ఇటీవల మృతి చెందిన కాంగ్రెస్ నేత వెన్నం రాఘవేంద్రరెడ్డి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు.