Share News

‘గురుకుల పరీక్ష’లో ప్రశ్నపత్రాలు తారుమారు

ABN , Publish Date - Feb 23 , 2026 | 03:02 AM

గురుకుల పాఠశాలల్లో ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాలు తారుమారుకావడంతో జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్‌ మండలం ర్యాలంపాడు, నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాలలో ఆదివారం గందరగోళ పరిస్థితి నెలకొంది....

‘గురుకుల పరీక్ష’లో ప్రశ్నపత్రాలు తారుమారు

  • జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో ఘటనలు

ధరూరు/హైదరాబాద్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): గురుకుల పాఠశాలల్లో ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాలు తారుమారుకావడంతో జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్‌ మండలం ర్యాలంపాడు, నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాలలో ఆదివారం గందరగోళ పరిస్థితి నెలకొంది. ర్యాలంపాడులోని పరీక్ష కేంద్రంలో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఉదయం 11 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటకు ముగియాల్సి ఉంది. అయితే సీల్డ్‌ కవర్‌లోని ప్రశ్న పత్రాలను అధికారులు తెరిచి చూడగా 6వ తరగతికి బదులు 5వ తరగతి పరీక్ష పత్రాలున్నాయి. దీంతో అధ్యాపకులు, అధికారులు విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. అయితే సమయం దాటినా పరీక్ష ప్రారంభంకాకపోవడంతో తల్లిదండ్రులు పాఠశాల లోపలికి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. అధికారులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. అధికారులు మరో పరీక్ష కేంద్రం నుంచి ఆరో తరగతి ప్రశ్న పత్రాల సెట్‌ను తెప్పించి జిరాక్స్‌ చేయించి మధ్యాహ్నం 3.45 గంటల నుంచి 5.45 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ఇక నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండల కేంద్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 7వ తరగతికి బదులు 8వ తరగతి ప్రశ్నపత్రాలు వచ్చాయి. దీంతో 11 గంటలకు పరీక్షను ప్రారంభించలేదు. ఒంటి గంటయినా తమ పిల్లలు బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలియడంతో పాఠశాల ముందు రాస్తారోకో చేపట్టారు. పాఠశాల ప్రిన్సిపాల్‌ తల్లిదండ్రులకు నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు. మరో కేంద్రం నుంచి ప్రశ్నపత్రం సెట్‌ను తప్పించి జిరాక్స్‌ తీయించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు పరీక్ష నిర్వహించారు.

‘గురుకుల పరీక్ష’కు 1.73లక్షల మంది హాజరు

రాష్ట్రంలోని పలు గురుకుల విద్యాసంస్థల్లో 5వ తరగతి ప్రవేశాలతో పాటు 6 నుంచి 9వ తరగతి వరకు ఉన్న ఖాళీ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన టీజీ సెట్‌-2026 ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష కోసం 492 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 1,82,061 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 1,72,842 మంది పరీక్ష రాశారు. 9,219 మంది గైర్హాజరయ్యారు. అంటే విద్యార్థుల హాజరు శాతం 94.93గా ఉందని, పరీక్ష ప్రక్రియ అంతా విజయవంతంగా పూర్తయిందని టీజీ సెట్‌ చీఫ్‌ కన్వీనర్‌ కృష్ణ ఆదిత్య తెలిపారు. భారీ సంఖ్య లో విద్యార్థులు హాజరుకావడం గురుకుల విద్యాసంస్థల పట్ల తల్లిదండ్రుల్లో ఉన్న నమ్మకాన్ని, ఆసక్తిని తెలియజేస్తోందన్నారు.

Updated Date - Feb 23 , 2026 | 03:02 AM