Share News

జోగుళాంబ సన్నిధిలో కేంద్రమంత్రి కుమారస్వామి

ABN , Publish Date - Feb 23 , 2026 | 03:03 AM

అలంపూర్‌ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి వార్లను కర్ణాటక మాజీ సీఎం, కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి దంపతులు ఆదివారం సందర్శించారు.

జోగుళాంబ సన్నిధిలో కేంద్రమంత్రి కుమారస్వామి

  • స్వామి వార్లకు అభిషేకం, పట్టువస్త్రాల సమర్పణ

  • నడిగడ్డలో పరిశ్రమల ఏర్పాటుకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి విన్నపం

అలంపూరుచౌరస్తా, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): అలంపూర్‌ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి వార్లను కర్ణాటక మాజీ సీఎం, కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి దంపతులు ఆదివారం సందర్శించారు. ఓర్వకల్లు విమానశ్రయం నుంచి రోడ్డు మార్గంలో అలంపూర్‌ చేరుకున్న ఆయనకు గద్వాల కలెక్టర్‌ సంతో్‌షకుమార్‌, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, విజయుడు ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభతో స్వాగతం పలకగా, కుమారస్వామి దంపతులు బాలబ్రహ్మేశ్వర స్వామికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి పట్టువస్త్రాలు సమర్పించారు. దర్శనానంతరం కేంద్ర మంత్రి మీడియాతో కన్నడలో మాట్లాడారు. జోగుళాంబ అమ్మవారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. తెలుగు, కన్నడ రాష్ట్రాల మధ్య విడదీయరాని బంధం ఉందని వివరించారు. అయిజ మీదుగా రెండు రాష్ట్రాలను కలిపే అంతర్రాష్ట్ర రహదారి విస్తరణపై ఇరు జిల్లాల కలెక్టర్లతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఇదే క్రమంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి మంత్రిని కలిసి, నడిగడ్డ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలని విన్నవించారు.

Updated Date - Feb 23 , 2026 | 03:03 AM