Mahabubnagar: పాలమూరును బీఆర్ఎస్ పట్టించుకోలేదు.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్..
ABN , Publish Date - Jan 17 , 2026 | 06:43 PM
మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా ఎంవీఎస్ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ పదేళ్ల పాలనలో పాలమూరును పట్టించుకోలేదని విమర్శించారు..
మహబూబ్‌నగర్: పదేళ్ల పాలనలో కేసీఆర్ పాలమూరును పట్టించుకోలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మంజూరు చేసిన ఒక్క ప్రాజెక్ట్ అయినా పాలుమూరులో ఉందా? అని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.1,284 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సీఎం శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
‘మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం సహా పాలమూరును అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. మేం అధికారంలోకి వచ్చాకే ప్రాజెక్టుల్లో వేగం పెరిగింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును 2013లో అప్పటి కాంగ్రెస్ నేతలు సాధించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టు పేరు మీద రూ.23 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించారు. కానీ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఉద్ధండాపూర్ జలాశయం భూ నిర్వాసితులకు నిధులు చెల్లించలేదు. సంగంబండ వద్ద బండ పగుల గొట్టేందుకు కేసీఆర్ పదేళ్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మేం అధికారంలోకి వచ్చాక భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం ఇచ్చాం. పాలమూరు బిడ్డ సీఎం కావడం వారికి నచ్చలేదు. మనం వాళ్ల మోచేతి నీళ్లు తాగాలని కోరుకున్నారు. ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ పెడితే ఆ పార్టీకి ముఖం చాటేశారు. అందరం కలిసి మహబూబ్‌నగర్ జిల్లాకు ఐఐఎంను తీసుకొద్దాం.
పాలమూరు ఎమ్మెల్యేలను కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే రానివ్వలేదు. మారీచుడు, సుబాహులను శుక్రాచార్యుడు పంపించి.. మేం చేసే ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారు. మాకు కూడా వ్యూహాలు, ఎత్తుగడలు తెలుసు. ఎవరు ఎలా వచ్చినా ప్రజలు వారిని తరిమికొడతారు. డబుల్ బెడ్‌రూమ్ ఇచ్చిన ఇళ్లలోనే వాళ్లు ఓట్లు అడగాలి. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న ఊళ్లోనే మేము ఓట్లు అడుగుతాం. మా సవాల్‌ను బీఆర్ఎస్ స్వీకరిస్తుందా?’ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ‘హైదరాబాద్ రాష్ట్రానికి తొలి సీఎం పాలమూరు బిడ్డే. 75 తర్వాత మళ్లీ ఆ అవకాశం ఇప్పుడొచ్చింది. 17 ఏళ్లలో అన్ని చట్టసభల్లో పనిచేశా. ప్రజలకు ఏదైనా మేలు చేయాలనే తపన తప్ప నాకు మరో ఆలోచన లేదు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ సాగుతున్నాం. నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ పాలమూరు జిల్లాకు వెలుగులు తేవాలని ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. కానీ విద్య పరంగా, సాగునీటి పరంగా నాటి పాలకులు నిర్లక్ష్యం వహించారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అప్పట్లో డీకే అరుణ, విఠల్ రావు కలిసి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వివరించారు. అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నపుడు ఆ ప్రాజెక్టు మంజూరైంది. కల్వకుర్తిలో మాడ్గులకు నీళ్లు రావాలంటే రూ. 75 కోట్లు అవసరం వచ్చాయి. కానీ ఆ నిధులను గత ప్రభుత్వం ఇవ్వలేదు. మేము అధికారంలోకి వచ్చాక రూ.1400 కోట్లతో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పతకాన్ని తీసుకొచ్చాం. రూ.123 కోట్లతో జూరాల వద్ద బ్రిడ్జి నిర్మించాం’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
ఇవి కూడా చదవండి..
పల్టీలు కొట్టిన కారు.. ఇద్దరు టీచర్లు మృతి