ఖర్గేతో సురేఖ భేటీ?
ABN , Publish Date - Aug 24 , 2026 | 05:04 AM
రాష్ట్ర కాంగ్రెస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ ఆదివారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసినట్లు తెలుస్తోంది.
బెంగళూరుకు వెళ్లి కలిసిన మంత్రి
15 నిమిషాలపాటు సమావేశం
కాంగ్రెస్‌ని, గాంధీ కుటుంబాన్ని
విమర్శించలేదని చీఫ్‌కు వివరణ
పార్టీకి, సీఎంకు వ్యతిరేకంగా
మాట్లాడటం సరికాదన్న ఖర్గే
క్రమశిక్షణ కమిటీకి
వివరణ ఇవ్వాలని సూచన
రెండుసార్లు ఇచ్చానన్న మంత్రి
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ ఆదివారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆమె బెంగళూరుకు వెళ్లినట్లు గాంధీభవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నాలుగు రోజుల క్రితం కొండా సురేఖ కుమార్తె సుస్మిత.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఇందుకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు కొండా సురేఖ సమాధానం కూడా ఇవ్వడం తెలిసిందే. అయితే కొండా సురేఖే వెనక ఉండి తన కూతురితో మాట్లాడించారని, ఇందుకు మంత్రిపై అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని పలువురు ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ఆమెను మంత్రివర్గం నుంచి తప్పిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సురేఖ రాష్ట్ర నాయకుల అపాయింట్‌మెంట్ కోరినప్పటికీ వారు అందుబాటులోకి రాకపోవడంతో.. ఆమె బెంగళూరు వెళ్లి ఖర్గేను కలిశారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఆదివారం మధ్యాహ్నం సమయంలో సుమారు 15 నిమిషాలపాటు ఖర్గేతో ఆమె భేటీ అయినట్లు, తన కూతురు చేసిన వ్యాఖ్యల తర్వాత జరిగిన పరిణామాలను ఆయనకు వివరించినట్లు చెబుతున్నాయి.
ఈ సందర్భంగా.. తాము కాంగ్రెస్ పార్టీని, గాంధీ కుటుంబాన్ని విమర్శించలేదని, కొందరు కావాలనే తమను టార్గెట్ చేశారని సురేఖ చెప్పినట్లు సమాచారం. ఖర్గే కూడా కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై ఆరా తీసినట్లు, పార్టీకి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడటం మంచిది కాదని అన్నట్లు గాంధీభవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇవ్వాలని సురేఖకు చెప్పగా.. ఇప్పటికే రెండుసార్లు వివరణ ఇచ్చానని ఆమె తెలిపినట్లు సమాచారం. అయితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొద్దిగంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు చేరుకోనుండగా.. కొండా సురేఖ ఏఐసీసీ అధ్యక్షుడితో భేటీ కావడం హాట్ టాపిక్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
రిషభ్ పంత్ గాయంపై టీమిండియా కోచ్ కీలక అప్‌డేట్
తుర్కియే మిలిటరీ విమానాల్లో డ్రోన్స్ తరలింపు?