ఖరగ్‌పూర్-అమరావతి కారిడార్‌కు కేంద్రం అనుమతి
ABN , Publish Date - Aug 24 , 2026 | 03:35 AM
ఆంధ్రప్రదేశ్‌కు తూర్పు భారతదేశంతో మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రం మీదుగా 457 కిలోమీటర్ల రహదారి
మోదీ, గడ్కరీలకు సీఎం థ్యాంక్స్
రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధికి, ఆర్థిక వృద్ధికి మైలురాయిగా అభివర్ణన
అమరావతి, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు తూర్పు భారతదేశంతో మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 1107 కిలోమీటర్ల పొడవుతో రూపుదిద్దుకోనున్న ప్రతిష్ఠాత్మక ఖరగ్‌పూర్-అమరావతి కారిడార్ నిర్మాణానికి అధికారికంగా ఆమోదముద్ర వేసింది. ఈ ప్రకటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం ఎక్స్‌లో పోస్టు చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధికి, ఆర్థిక వృద్ధికి ఈ ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలుస్తుందని అంచనావేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘ఈ భారీ కారిడార్‌లో సుమారు 457 కిలోమీటర్లు రహదారి ఆంధ్రప్రదేశ్ మీదుగానే వెళ్తుంది. దీనివల్ల ఏపీ నేరుగా తూర్పు భారతదేశంతో అనుసంధానమై రవాణా రంగంలో వేగవంతమైన పురోగతి సాధించనుంది. రాజధాని అమరావతిని ప్రముఖ ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దడంతో ఈ కారిడార్ ముఖ్యభూమిక పోషించనుంది. ఈ రహదారి మార్గం ద్వారా రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు వచ్చి, యువతకు ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి’ అని సీఎం పేర్కొన్నారు. సంబంధిత కారిడార్ మ్యాప్‌ను కూడా ఎక్స్‌లో పోస్టు చేశారు.