Share News

వందకు 10 శాతమే అర్హులు!

ABN , Publish Date - Aug 24 , 2026 | 03:46 AM

యూనివర్సిటీ పోస్టుల భర్తీలో అనుకున్నదే జరిగింది! ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసిన వారిలో ప్రధానంగా ‘యూజీసీ పేస్కేలు’ నిబంధన కారణంగా దాదాపు 90 శాతం మంది..

వందకు 10 శాతమే అర్హులు!

  • వర్సిటీ పోస్టుల అభ్యర్థులపై ‘అనర్హత’ వేటు

  • ‘యూజీసీ పేస్కేలు’ నిబంధన కారణంగా భారీగా నష్టపోయిన వైనం

  • ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు బ్యాంక్‌ స్టేట్‌మెంట్లు, రిటర్న్‌లు ఉండాలని రూల్‌

  • ఫలితంగా 90 శాతం మంది అనర్హత

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

యూనివర్సిటీ పోస్టుల భర్తీలో అనుకున్నదే జరిగింది! ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసిన వారిలో ప్రధానంగా ‘యూజీసీ పేస్కేలు’ నిబంధన కారణంగా దాదాపు 90 శాతం మంది అనర్హులుగా మారినట్లు తెలుస్తోంది. ఆ రెండు పోస్టులకు అవసరమైన బోధనా సర్వీసు కాలం జీతాలకు సంబంధించి బ్యాంక్‌ స్టేట్‌మెంట్లు, ఐటీ రిటర్న్‌లు సమర్పించాలని యూనివర్సిటీలు నిబంధన పెట్టడంతో చాలా మంది అనర్హతకు గురయ్యారు.పోస్టులకు తుది అర్హుల జాబితాలను యూనివర్సిటీలు ఇటీవల విడుదల చేశాయి. తొలుత ప్రాథమిక అర్హుల జాబితాలను విడుదల చేయగా, వాటిపై వినతులు స్వీకరించి తాజాగా తుది జాబితాలను విడుదల చేశాయి.


ఆ రెండింటితో నష్టపోయిన అభ్యర్థులు

ప్రొఫెసర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పదేళ్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు ఎనిమిదేళ్ల బోధనా అనుభవం ఉండాలనేది నిబంధన. ఆ మేరకు పనిచేసిన కాలానికి యూజీసీ పేస్కేల్‌ పొంది ఉండాలి. రాష్ట్రంలో కొన్ని విద్యాసంస్థలు మినహా ఎవరూ యూజీసీ పేస్కేలు ప్రకారం జీతాలు ఇవ్వట్లేదు. అయితే ఆ మేరకు చెల్లిస్తున్నట్లుగా సంబంధిత యూనివర్సిటీ రాటిఫికేషన్‌ (ధ్రువీకరణ) చేస్తోంది. ఆ సర్టిఫికెట్లతో గతంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు. ఇప్పుడు ఆ సర్టిఫికెట్‌ తో పాటు ప్రొఫెసర్‌ పోస్టుకైతే పదేళ్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకైతే ఎనిమిదేళ్ల పాటు జీతాల బ్యాంక్‌ స్టేట్‌మెంట్లు, ఐటీ రిటర్న్‌లు సమర్పించాలని వర్సిటీలు నిబంధన పెట్టాయి. దీంతో రాటిఫికేషన్‌ సర్టిఫికెట్‌ ఉన్నా బ్యాంక్‌ స్టేట్‌మెంట్లు, ఐటీ రిటర్న్‌లు లేక చాలా మంది నష్టపోయారు. న్యాయం చేయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఉన్నత విద్యాశాఖ, యూనివర్సిటీలు పట్టించుకోలేదని అంటున్నారు.


అన్ని యూనివర్సిటీల్లో అంతే..

కఠిన నిబంధనలతో అన్ని వర్సిటీల్లోనూ పోస్టులకు తక్కువ మందే అర్హులుగా ఉన్నారు. ఉదాహరణకు ఏఎన్‌యూలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో ప్రొఫెసర్‌ పోస్టుకు 14 మంది దరఖాస్తు చేస్తే.. ముగ్గురే అర్హులుగా తేలారు. ఫిజిక్స్‌ పోస్టుకు ఆరుగురు దరఖాస్తు చేయగా.. అందరూ అనర్హులయ్యారు. గణితం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు 17మందికి ఒక్కరే అర్హత సాధించారు. నన్నయ వర్సిటీలో ఫార్మాసూటికల్‌ సైన్సెస్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు 202 మందిలో 193 మంది అనర్హులయ్యారు. ఆంధ్రకేసరి వర్సిటీలో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు 21 మందికి గాను ఒక్కరే అర్హులు. ఏయూలో అప్లైడ్‌ మాథమేటిక్స్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు 123 మంది దరఖాస్తు చేయగా 12 మందికి అర్హత లభించింది. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, హిందీ, లా, సివిల్‌ ఇంజనీరింగ్‌, మైక్రో బయాలజీ, ఫైన్‌ ఆర్ట్స్‌, ఫిలాసఫీ అండ్‌ రెలిజియస్‌ స్టడీస్‌, న్యూక్లియర్‌ ఫిజిక్స్‌, హ్యూమన్‌ జెనెటిక్స్‌, మ్యూజిక్‌ అండ్‌ డాన్స్‌, జాగ్రఫీ, లైబ్రరీ సైన్స్‌, పొలిటికల్‌ సైన్స్‌ అండ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ర్టేషన్‌ విభాగాల్లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు ఒక్కరూ అర్హులు లేకపోవడం గమనార్హం. జేఎన్‌టీయూ కాకినాడలో సీఎస్ఈ అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు ఒక్కరూ అర్హులు లేరు. ఎస్వీయూలో ఫార్మాసూటికల్‌ సైన్సెస్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు 92 మంది దరఖాస్తు చేయగా ముగ్గురు అర్హులుగా మిగిలారు.


రాటిఫికేషన్‌పై ఏం చేస్తారు?

ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తుదారు సర్వీసు రాటిఫికేషన్‌ కాకపోతే అది విద్యాసంస్థ తప్పు అవుతుందని, ఆ కారణంతో దరఖాస్తును తిరస్కరించలేరని ఇటీవల హైకోర్టు స్పష్టం చేసింది. దరఖాస్తును తిరస్కరించడంతో ఓ అభ్యర్థి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అన్ని అర్హతలు ఉన్నా సర్వీసు రాటిఫై కాలేదంటూ దరఖాస్తును తిరస్కరించారని వాదించారు. దీంతో ఆ అభ్యర్థి దరఖాస్తు స్వీకరించాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఇప్పుడు మొత్తం అభ్యర్థులకు ఈ తీర్పును అమలు చేస్తారా? లేక ఆ ఒక్క అభ్యర్థికే పరిమితం చేస్తారా? అనేది చూడాలి. కాగా, అందరికీ ఇదే తీర్పును అమలు చేయాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Aug 24 , 2026 | 03:50 AM