Share News

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో జనసేన

ABN , Publish Date - Aug 24 , 2026 | 04:26 AM

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి జనసేన సిద్ధమైంది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తమ అభ్యర్థిగా డాక్టర్‌ గడల శ్రీనివాసరావును ప్రకటించింది.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో జనసేన

  • ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ జిల్లాల.. పట్టభద్రుల అభ్యర్థిగా గడల శ్రీనివాసరావు

హైదరాబాద్‌, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి జనసేన సిద్ధమైంది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తమ అభ్యర్థిగా డాక్టర్‌ గడల శ్రీనివాసరావును ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం అధికారికంగా వెల్లడించింది. జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, అధికార ప్రతినిధి, ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తోన్న గడల గతంలో రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులుగా పనిచేశారు. ఆయనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దించాలనే ప్రతిపాదనను జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీరామ్‌ తాళ్లూరి, తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి శంకర్‌ గౌడ్‌ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లారు. గడల అభ్యర్థిత్వానికి జనసేన చీఫ్‌ సుముఖత వ్యక్తం చేశారు. దాంతో ఉమ్మడి ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్‌ గడల శ్రీనివాసరావు పేరును జనసేన అధికారికంగా ముందస్తుగా ప్రకటించింది. తనను అభ్యర్థిగా ప్రకటించినందుకు అధినేత పవన్‌ కల్యాణ్‌కు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి తొలిసారిగా 2015లో సాధారణ ఎన్నికలు జరిగాయి. నాడు టీఆర్‌ఎస్‌ తరపున పల్లా రాజేశ్వరరెడ్డి ఈ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2021లో జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ మళ్లీ ఆయనే బీఆర్‌ఎస్‌ తరపున విజయం సాధించారు. అప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన తీన్మార్‌ మల్లన్న గట్టిపోటీ ఇచ్చారు. తీవ్ర పోటీ మధ్య రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో పల్లా గెలిచారు. తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పల్లా జనగామ ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అప్పుడు కాంగ్రెస్‌ తరఫున బరిలో దిగిన తీన్మార్‌ మల్లన్న ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఆయన పదవీ కాలం ముగియనుండటంతో 2027 మార్చిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.

Updated Date - Aug 24 , 2026 | 04:27 AM