Share News

తెలంగాణలో కాంగ్రెస్‌ను కూకటివేళ్లతో పెకిలిస్తాం.. మహా పాదయాత్రలో అమిత్ షా

ABN , Publish Date - Nov 02 , 2026 | 05:54 PM

‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం - అరాచకవాదాన్ని అంతం చేద్దాం’ పేరిట బీజేపీ నిర్వహిస్తున్న మహా పాదయాత్రలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పాల్గొని ఆ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు. అనంతరం ఆయన బహిరంగ సభలో ప్రసంగించారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ను కూకటివేళ్లతో పెకిలిస్తాం.. మహా పాదయాత్రలో అమిత్ షా

హైదరాబాద్, నవంబర్ 2: ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం - అరాచకవాదాన్ని అంతం చేద్దాం’ పేరిట బీజేపీ నిర్వహిస్తున్న మహా పాదయాత్రలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పాల్గొని ఆ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు. తెలంగాణలో కాషాయ పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే తనతోపాటే నినాదాలు చేయాలని ఆయన ప్రజలను కోరారు. అనంతరం అమిత్ షా బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేద్దామని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడి, ఇక్కడి అరాచకశక్తులను తుదముట్టిద్దామని చెప్పారు. త్వరలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోందని కేంద్ర హోంమంత్రి ధీమా వ్యక్తం చేశారు.


రాహుల్‌ ఒక చొరబాటుదారుడు..

అనంతరం అమిత్ షా కాంగ్రెస్ పార్టీ పై మండిపడ్డారు. ఢిల్లీలో ఆ పార్టీ నిర్వహించింది ఓట్‌ బచావో ర్యాలీ కాదని, అది చొరబాటుదారులను కాపాడే ప్రయత్నమని ఆయన విమర్శించారు. ‘రాహుల్‌ గాంధీ కూడా ఒక చొరబాటుదారుడు. కాంగ్రెస్‌.. చొరబాటుదారులను ఓటుబ్యాంక్‌గా చూస్తోంది. చొరబాటదారుల ఓట్లు తొలగించొద్దా? ఒక వ్యక్తికి రెండు ఓట్లు ఉంటే తొలగించాలా.. వద్దా?’అని ప్రశ్నించారు. దొంగ ఓట్లు తొలగిస్తుంటే రాహుల్‌కు కడుపుమండుతోందని ధ్వజమెత్తారు.

సర్‌ ప్రక్రియను ఆపాలని కాంగ్రెస్‌ అండ్‌ కంపెనీ కుట్ర చేస్తోందని, 13 కోట్ల ఓట్లు తొలగించారని రాహుల్‌ అబద్ధాలు చెబుతున్నారని అమిత్ షా ఆరోపించారు. ‘సర్ జరగకముందూ అనేక ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. సర్ కారణంగానే మేం అధికారంలోకి వచ్చామని రాహుల్ అంటున్నారు. మరి రాహుల్‌ ఎంపీ అయింది కూడా సర్ వల్లేనా’ అంటూ కేంద్ర హోంమంత్రి చురకలంటించారు. జీవితంలో రాహుల్‌ ప్రధాని కాలేరని, మాక్‌ పార్లమెంట్‌లో ప్రధాని సీట్‌లో కూర్చొని సంబరపడాల్సిందేనని ఎద్దేవా చేశారు. తాము సర్‌పై చర్చించేందుకు సిద్ధమని కాంగ్రెస్ పార్టీకి సవాలు విసిరారు.


ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు

ఈవీఎంలతోనే కేంద్రంలో బీజేపీ గెలిచిందనుకుంటే, తెలంగాణలో రేవంత్‌ ఎలా గెలిచారని అమిత్‌ షా ప్రశ్నించారు. రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డి ఎంత ప్రయత్నించినా చొరబాటుదారులకు ఓటు దక్కనివ్వబోమని నొక్కి చెప్పారు. ‘ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ వెంటిలేటర్‌పై ఉంది. అలాంటి పార్టీ మోదీని అడ్డుకుంటుందా? కాంగ్రెస్‌ను రాహుల్‌ గాంధీ కాపాడలేరు’అని పేర్కొన్నారు. ‘తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఆర్ఆర్ అంటే రేవంత్‌ టూ రాహుల్‌ ట్యాక్స్‌. రాహుల్‌కు రేవంత్‌ కప్పం కడుతున్నారు’ అని అమిత్ షా ఆరోపించారు. తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు కావట్లేదని ఆయన విమర్శించారు.

Updated Date - Nov 02 , 2026 | 06:04 PM