బాసరకు పోటెత్తిన భక్తులు.. సరస్వతి అవతారంలో బెజవాడ దుర్గమ్మ
ABN , Publish Date - Jan 23 , 2026 | 07:57 AM
వసంత పంచమి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని అమ్మవారి ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. బాసరలోని సరస్వతి అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాస కార్యక్రమం తెల్లవారుజాము నుంచే ప్రారంభమయ్యింది.
నిర్మల్, జనవరి 23: వసంత పంచమి నేపథ్యంలో బాసరలోని జ్ఞాన సరస్వతీ దేవి ఆలయానికి శుక్రవారం భక్తులు భారీగా పోటెత్తారు. గురువారం అర్ధరాత్రి ఒంటి గంటకు అమ్మవారికి మంగళ వాయిద్య, సుప్రభాత సేవలను ఆలయ పండితులు నిర్వహించారు. ముగ్గురు అమ్మవార్లకు అభిషేక పూజలను ఆలయ అర్చకులు జరిపించారు. అనంతరం ఉదయం 3.00 గంటల నుంచి అక్షరాభ్యాసాలు ప్రారంభించారు. అమ్మవారి దర్శనం కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్‌లతోపాటు అక్షరాభ్యాస మండపాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. దేవాలయంలో అమ్మవారి దర్శనానికి మూడు గంటలు, అక్షరాభ్యాస పూజకు రెండు గంటల సమయం పడుతోంది.
మరోవైపు బాసరలో వసంత పంచమి ఉత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఇవి ఈ రోజు.. అంటే శుక్రవారంతో ముగియనున్నాయి. బాసర క్షేత్రంలో ఉత్సవాల ప్రారంభం నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. అయితే వసంత పంచమి వేళ.. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచీ భారీగా భక్తులు తరలివస్తున్నారు. దాంతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా.. ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఇంకోవైపు సిద్ధిపేట సమీపంలోని వర్గల్‌లో శ్రీసరస్వతి ఆలయానికి భక్తులు తరలివచ్చారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచే ఆలయంలో క్యూలైన్లు అన్ని భక్తులతో నిండిపోయాయి. ఇక విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీదుర్గమల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో దుర్గమ్మ వారు.. ఈ రోజు చదువుల తల్లి సరస్వతి దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు.
ఉదయం 7.00 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకూ పాఠశాల విద్యార్థులకు ఉచిత దర్శనం కల్పించనున్నారు. అదీకాక ఈ రోజు శుక్రవారం కూడా కలిసి రావడంతో.. దుర్గమ్మ దర్శనానికి భారీగా భక్తులు రానున్నారు. అందుకోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For More Telangana News and National News